Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గొంతు కోసి చంపిన ఇంటి పనివాడు
జమ్మూ : జమ్ము కాశ్మీర్ పోలీసు ఉన్నతాధికారి తన ఇంట్లో సోమవారం అర్దరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఇంట్లో సహాయకుడిగా పనిచేసే వ్యక్తే గొంతు కోసి హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన అనుమానితుడైన ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జమ్ము కాశ్మీర్ జైళ్ల ఇన్చార్జి హేమంత్ కుమార్ లోహియా జమ్మూ శివార్లలో స్నేహితుని ఇంట్లో హత్యకు గురయ్యాడు. తన సొంత ఇల్లు మరమ్మత్తు చేస్తున్న కారణంగా కుటుంబంతో కలిసి స్నేహితుని ఇంట్లో వుంటున్నారు. ఆగస్టులోనే లోహియా (57) జైళ్ల డిజిగా నియమితులయ్యారు. ప్రాథమిక దర్యాప్తు, సిసిటివి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు 23ఏళ్ల పనివాడు యాసిర్ అహ్మద్ పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆరు మాసాల క్రితమే యాసిర్ పనిలో చేరాడు. ఈ ఘటనలో ఎలాంటి తీవ్రవాద హస్తం వుందని భావించడం లేదని పోలీసులు చెప్పారు. హత్య జరిగిన వెంటనే యాసిర్ పరారవగా, పోలీసులు తీవ్రంగా గాలించి పట్టుకున్నారు. యాసిర్ తీవ్రంగా మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నాడని జమ్ము సీనియర్ పోలీసు అధికారి ముకేష్ సింగ్ తెలిపారు. కెచప్ బాటిల్‌ను పగలగొట్టి దాంతో గొంతు కోసినట్లు తెలుస్తోంది. ఆ ఇంటి నుండి డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. దాడి జరిగిన సమయంలో లోహియా, వాచిన తన పాదానికి నూనె మర్దన చేసుకుంటున్నారని సింగ్ చెప్పారు. హంతకుడు ముందుగా పగిలిన కెచప్ బాటిల్‌తో గొంతు కోసి తర్వాత శవాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించాడని తెలిపారు. ఆ శరీరంపై కాలిన గాయాలు కనిపిస్తున్నాయన్నారు. మంటలు కనిపించడంతో లోహియా గది తలుపులు పగలగొట్టుకుని భద్రతా గార్డులు వెళ్లారు. ఆ గదికి లోపలి వైపు నుండి తాళం వేసి వుందని సింగ్ తెలిపారు. యాసిర్ పారిపోతున్న దృశ్యం సిసిటివి ఫుటేజీలో నమోదైంది. పోలీసులు కొన్ని సాక్ష్యాధారాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలా తీసుకున్న డైరీ యాసిర్ మానసిక స్థితిని తెలియజేస్తోంది.