Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులు ఎలా సమకూర్చుతారో స్పష్టం చేయాలని రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ మేరకు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ లేఖ రాసింది. అందులో వివరాలు తెలియజేయాల్సిన ఫార్మాట్‌ను రూపొందించి జత చేసింది. ఎన్నికల వాగ్దానాలకు రాజకీయ పార్టీలను మరింత జవాబుదారీగా చేయడానికీ, ఓటర్లకు ''నిజమైన, తగిన'' సమాచారాన్ని అందించాలని కోరింది. ఈ నెల 19లోగా సమాధానాలు పంపాలనీ, ఒక వేళ పంపకపోతే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) సవరణకు ఆయా పార్టీలు చెప్పేది ఏమీ ఉండదని ఈసీ భావిస్తోందని పేర్కొంది.
రాజకీయ పార్టీలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలకు ఖర్చుల వివరాలను వివరించి, ఓటర్లకు కొంత అవగాహన కల్పిస్తూ వారి ఆర్థిక స్థితిని కూడా వివరించాలని ప్రతిపాదించింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలకు ఆర్థికపరమైన చిక్కులు, వాటికి ఆర్థికసాయం చేసే మార్గాల వివరాలను అందించడానికి గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు తెలియజేయాలని కోరింది. ఎన్నికల వాగ్దానాలపై స్పష్టత అంశంపై ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపడమనేదాన్ని విస్మరించలేమని పేర్కొంది.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించడం అవసరమని తెలిపింది. ఓటర్లందరూ తమ ఓటును సులభంగా భయం, ఆకర్షణ లేకుండా వినియోగించుకునే చూడాల్సిన అవసరం ఉంది. సుబ్రమణ్యం బాలాజీ కేసులో సుప్రీంకోర్టు ఎన్నికల మ్యానిఫెస్టోలోని అంశాలను నేరుగా నియంత్రించే చట్టమేదీ లేదనీ, అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి మ్యానిఫెస్టో కోసం మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించిందనీ, దానికనుగుణంగా ఈసీ ప్రక్రియ మొదలుపెట్టిందని తెలిపింది. సంప్రదింపుల కోసం 2013 ఆగస్టు 12న, మళ్లీ 2019లో అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని పేర్కొంది.
''పౌరుల కోసం వివిధ సంక్షేమ చర్యలను రూపొందించాలని రాజ్యాంగంలో పొందుపర్చిన నిర్దేశక సూత్రాలు ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాయి. కాబట్టి ఎన్నికల మ్యానిఫెస్టోల్లో అలాంటి సంక్షేమ చర్యల వాగ్దానానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఏది ఏమైనప్పటికీ, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతకు భంగం కలిగించే, తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఓటర్లపై అనవసరమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్న వాగ్దానాలు చేయడం మానుకోవాలి'' అని తెలిపింది. ''పారదర్శకత, వాగ్దానాల విశ్వసనీయత దృష్ట్యా మ్యానిఫెస్టోలు వాగ్దానాల హేతుబద్ధతను ప్రతిబింబిస్తాయనీ, అందువల్ల ఆర్థిక అవసరాలను తీర్చడానికి మార్గాలను విస్తృతంగా సూచిస్తాయని భావిస్తున్నాం. నెరవేర్చడానికి సాధ్యమయ్యే హామీలపై మాత్రమే ఓటర్ల విశ్వాసాన్ని కోరాలి'' అని సూచించింది. ఇప్పటికే ఉన్న నియమావళి మార్గదర్శకాలను అమలు చేయాలనీ, అలాగే ఓటర్లకు పూర్తి సమాచారం ఇవ్వాలని రాజకీయ పార్టీలను ఆదేశించాలని కమిషన్ ప్రతిపాదించింది. చేసిన వాగ్దానాల ఆర్థిక చిక్కులు, ఆర్థిక వనరుల లభ్యత అంశాలను, వాగ్దానాలను నెరవేర్చడానికి అదనపు ఖర్చులను తీర్చడానికి వనరులను సేకరించే మార్గాలు తెలియజేయాలి.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) పార్ట్ 8లోని సబ్ పేరా 3 (2)లో ప్రతిపాదిత సవరణను కొనసాగించే ముందు రాజకీయ పార్టీల అభిప్రాయాలను అభ్యర్థించాలని ఈసీ నిర్ణయించింది. అందుకనుగుణంగా అక్టోబర్ 19న లోపు రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలపాలని కోరింది. అప్పటికి ఎటువంటి స్పందన పంపని పార్టీలు, ఎంసీసీలో ప్రతిపాదించిన సవరణపై ఆయా పార్టీలు ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదని ఈసి భావిస్తోందని పేర్కొంది.
తెలియజేయాల్సిన వివరాలు
ఎ. పన్ను, పన్నుయేతర ఆదాయాలలో పెరుగుదల
బి. వ్యయాల హేతుబద్ధీకరణ
సి. అదనపు రుణాలు
డి. ఏవైనా ఇతర మార్గాలు