Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 38 శాతం గ్రామీణ ఇండ్లలో ఇదీ పరిస్థితి
- కేంద్ర జల మంత్రిత్వ శాఖ నివేదిక అంచనా
న్యూఢిల్లీ : దేశంలోని ప్రతి ఇంటికీ నీటి కుళాయి ద్వారా నీరు అందటం లేదు. కారణం.. చాలా వరకు గృహాలకు ఇప్పటికీ కనెక్షన్లు అందలేదు. భారత్‌లోని 38 శాతం గ్రామీణ గృహాలు ఇప్పటికీ నీటి కనెక్షన్‌ను కలిగి లేవు. కేంద్ర జల మంత్రిత్వ శాఖ అంచనా నివేదికలో ఈ విషయం వెల్లడి కావటం గమనార్హం. తమిళనాడు (86శాతం), హిమాచల్‌ప్రదేశ్ (82), గోవా (81), తెలంగాణ (80శాతం) లు కుళాయి కనెక్షన్‌ను కలిగి ఉన్న రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. నీటి కొరత ఉన్న రాజస్థాన్ (38శాతం), మణిపూర్, అండమాన్ నికోబార్ దీవులు (40 శాతం చొప్పున), త్రిపుర (41 శాతం), మహారాష్ట్ర (43శాతం), మధ్యప్రదేశ్ (38శాతం) లు అత్యల్ప ఫంక్షనాలిటీ స్కోర్‌తో అట్టడుగున ఉన్నాయి. జాతీయ సగటు 62శాతం కంటే తక్కువ కార్యాచరణ ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఒడిశా (54శాతం), హర్యానా, జార్ఖండ్ (55శాతం చొప్పున), యూపీ (57 శాతం), కర్నాటక (58 శాతం)లు ఉన్నాయి. 2024 నాటికి భారత్‌లోని అన్ని గ్రామీణ గృహాలకు వ్యక్తిగత గృహ కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన, తగినంత తాగునీటిని క్రమం తప్పకుండా అందించాలనే లక్ష్యంతో జల్‌జీవన్ మిషన్ (జేజేఎం) కింద ఈ అంచనాను రూపొందించారు.