Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 58,000 ఎగువకు సెన్సెక్స్
ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని బలమైన సంకేతాలు, రూపాయి పుంజుకోవడం వంటి అంశాలతో మంగళవారం దేశీయ స్టాక్‌మార్కెట్లు బాగా పుంజుకున్నాయి. నిఫ్టీ50 ఇంట్రాడేలో 300 పాయింట్లకు పైగా పెరిగి 17,200 ఎగువకు చేరింది. సెప్టెంబరు 23 తర్వాత నిఫ్టీ మళ్లీ ఈ స్థాయిని అందుకుంది. మరోవైపు సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా ఎగబాకి 58,099.94 వద్ద గరిష్ఠానికి చేరింది. మరోవైపు బజాజ్, హెచ్డీఎఫ్సీ జంట షేర్లు, టీసీఎస్, రిలయన్స్ వంటి దిగ్గజాలు రాణించడం కూడా సూచీల పరుగుకు కారణమైంది. నిఫ్టీ మిడ్ క్యాప్100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు సైతం 1 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు ఐటీ, బ్యాంకింగ్, లోహ రంగ షేర్లలో కొనుగోళ్ల జోరు కొనసాగింది. ఈ నెల మొత్తం బుల్లిష్ సెంటిమెంట్ కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సెన్సెక్స్ ఉదయం 57,506.65 పాయింట్ల వద్ద భారీ లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 58,099.94 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1276.66 పాయింట్ల లాభంతో 58,065.47 వద్ద ముగిసింది. 17,147.45 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 386.95 పాయింట్లు ఎగబాకి 17,274.30 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,287.30 వద్ద గరిష్ఠాన్ని తాకింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.81.52 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 షేర్లలో పవర్‌గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా మాత్రమే నష్టపోయాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టిసిఎస్, బజాజ్‌ఫిన్‌సర్వ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టి, విప్రో, యాక్సిస్ బ్యాంక్, ఐటిసి, ఇన్ఫోసిస్ రాణించిన షేర్లలో ఉన్నాయి. రెండు నెలల విరామం తర్వాత సెప్టెంబరులో తిరిగి నికర అమ్మకందారులుగా నిలిచిన విదేశీ మదుపర్లు.. అక్టోబరు నెలను కొనుగోళ్లతో ప్రారంభించారు. సోమవారం రూ.590 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ప్రముఖ కంపెనీలైన బజాజ్, హెచ్‌డిఎఫ్‌సి జంట షేర్లు, టిసిఎస్, ఐటిసి, రిలయన్స్ రాణించడం కూడా మార్కెట్లకు కలిసొచ్చింది.