Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్మూకాశ్మీర్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అమిత్ షా
రాజౌరి : పహారీ వర్గాన్ని ఎస్టీలుగా గుర్తించి త్వరలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది జమ్ము కాశ్మీర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజౌరిలో మంగళవారం జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. 'ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిడి శర్మ కమిషన్ తన నివేదికను సమర్పించింది. గుజ్జార్, బకర్వాల్, పహారీ వర్గాలకు రిజర్వేషన్ల కోసం సిఫార్సు చేసింది. దీనిని త్వరలో అమలు చేస్తాం' అని తెలిపారు. ఒక వేళ పహారీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తే ఒక భాషా పరమైన గ్రూపునకు రిజర్వేషన్ కల్పించడం ఇదే మొదటిసారి అవుతుంది. దీనికోసం పార్లమెంట్లో రిజర్వేషన్ చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయాల్సి ఉంటుంది. జమ్ముకాశ్మీర్లో పహారీలు సుమారు 6 లక్షల మంది ఉంటారని అంచనా. వీరిలో 55 శాతం మంది హిందువులు, మిగిలిన వారు ముస్లిములు. గుజ్జార్, బకర్వాల్కు ఇప్పటికే 10 శాతం ఎస్టి కోటా రిజర్వేషన్ అమలవుతోంది. వీరు పహారీలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు. కేవలం భాష ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని అంటున్నారు.