Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉక్రెయిన్ ఘర్షణలకు సైనిక పరిష్కారమేదీ లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అవసరమైతే శాంతి ప్రయత్నాలకు సాయమందించడానికి భారత్ సిద్ధంగా వుందని చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మంగళవారం ఆయన ఫోన్లో మాట్లాడారు. అణ్వాయుధాలను మోహరించే ప్రమాదం వల్ల విపత్కర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. ఉక్రెయిన్లో తాజా పరిస్థితులు, పరిణామాలను ఇరువురు నేతలు చర్చించారు. సాధ్యమైనంత త్వరగా కాల్పులను విరమించి, చర్చలు, దౌత్య పంథాను అనుసరించాల్సిన అవసరాన్ని ప్రధాని మోడీ నొక్కి చెప్పారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఐక్యరాజ్య సమితి నిబంధనావళిని, అంతర్జాతీయ చట్టాలను, అన్ని దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించాల్సిన ప్రాముఖ్యతను ఆయన పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక సహకారాన్ని అందించుకోవాల్సిన కీలక రంగాల గురించి కూడా ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు.