Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరేష్ మెస్తాది హత్యకాదని తేల్చి చెప్పిన సిబిఐ
బెంగళూరు : ప్రశాంతంగా ఉన్న సమాజంలో మత ఘర్షణలు సృష్టించడానికి బీజేపీ ఎలాంటి కుట్రలకు పాల్పడుతుందో మరోసారి స్పష్టంగా వెల్లడైంది. ప్రమాదవశాత్తు సంభవించిన మరణాన్ని తన స్వార్థ ప్రయోజనాలకు బీజేపీ ఎలా వినియోగించుకోవాలని ప్రయత్నించిందో తాజాగా సిబిఐ దర్యాప్తులో బట్టబయలైంది. 2017 డిసెంబరు 8న ఉత్తర కన్నడ జిల్లాలోని హన్నోవర్లోని శేత్తికేర్ చెరువులో 18 ఏళ్ల పరేష్ మెస్తా మృతదేహాన్ని గుర్తించారు. పరేష్ ది మత హత్యేనని బీజేపీ అప్పటి నుంచి ప్రచారం ప్రారంభించింది. పరేష్ మెస్తాను కొంతమంది ముస్లిం వ్యక్తులు దారుణంగా వేధించి, హత్య చేసి చెరువులో పడేశారని బీజేపీ ప్రచారం చేసింది. పరేష్ వంటిపై ఉన్న శివాజీ మహారాజ్ చిత్రాన్ని చెరిపివేయడానికి వేడి నూనెతో కాల్చి, చెరువులో పడేశారని తప్పుడు వార్తలు వ్యాపింపజేసింది. ఇలాంటి ప్రచారంతో పరేష్ మరణం సంచలనంగా మారింది. కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2018 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదొక అంశంగా మారింది. దీంతో పరేష్ మెస్తా హత్య కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసును విచారించిన సీబీఐ పరేష్ది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా తేల్చింది. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడని తెలిపింది. 'విచారణ సమయంలో నిందితుల ప్రమేయాన్ని చూపించే ఎలాంటి నేరారోపణ సాక్ష్యం బయటపడలేదు, వివిధ సంస్థల నుంచి సేకరించిన వైద్య, చట్టపరమైన సాక్ష్యం, అభిప్రాయం ప్రకారం నీటిలో మునిగిపోవడమే కారణం, దీని ప్రకారమే కోర్టుకు తుది నివేదిక సమర్పిస్తాం' అని సీబీఐ అధికారి ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలో పరేష్ మరణాన్ని మతతత్వం చేసినందకు బీజేపీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.