Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రివిధ దళాల సమన్వయ ప్రణాళికపై ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి
న్యూఢిల్లీ : వాయు సేన సిద్ధాంత మూలాలపై ఏ కోణమూ కూడా రాజీ పడకూడదని కోరుకుంటున్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి తెలిపారు. త్రివిధ దళాలను సమన్వయం చేసే ప్రణాళిక (థియేటరైజేషన్ ప్లాన్)కు భారత వైమానిక దళం (ఐఎఎఫ్) వ్యతిరేకం కాదని చెప్పారు. ఈ నెల 8న వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఏటా ఏర్పాటు చేసే పత్రికా సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడారు. భారత సాయుధ దళాలు ఆమోదించిన ఏకీకరణ (ఇంటిగ్రేషన్) నమూనా భవిష్యత్ అవసరాలకు సిద్దంగా వుండాలి, నిర్ణయాలు తీసుకునే స్థాయిలను తగ్గించాలి, భారతదేశ పరిస్థితులకు, భౌగోళిక, రాజకీయ అవసరాలకు సరిపడే రీతిలో సంస్థాగత నిర్మాణానికి దారి తీయాలని అన్నారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మురింత మెరుగైన రీతిలో క్రమబద్ధీకరించే ప్రణాళిక కింద ఏర్పాటు చేయదలచిన వాటిలో కొన్ని అంశాల్లో ఐఎఎఫ్కు అభ్యంతరాలు వున్నాయని చౌదరి అంగీకరించారు. మొత్తంగా సైన్యం, వైమానిక దళం, నావికాదళం మధ్య మరింత మెరుగైన సమన్వయం వుండేలా చూసే ఈ ప్రణాళికకు మద్దతు సంపూర్ణంగా వుంటుందని చెప్పారు. సమ్మేళనం లేదా ఏకీకరణ ప్రక్రియను, థియేటర్ కమాండ్స్ క్రమాన్ని తాము వ్యతిరేకించమని చెప్పారు. త్రివిధ విభాగాలను సమ్మేళవిస్తూ ఏర్పాటు చేసే థియటర్ కమాండ్లపై అడిగిన ప్రశ్నకు ఆయన పై రీతిలో సమాధానమిచ్చారు. ఈ క్రమానికి పూర్తిస్థాయిలో మద్దతు వుంటుంది. కేవలం ఇందుకు అనుసరించే పద్ధతులు, వ్యవస్థ తీరు భవిష్యత్ అవసరాలకు అనువైనవిగా వుండాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. దానికోసమే తాము పట్టుబడుతున్నామన్నారు. ప్రతి విభాగానికి ఒక సిద్దాంతం వుంటుంది. ఈ కొత్త ప్రక్రియ వల్ల ఐఎఎఫ్ సిద్ధాంతంలో ఏ కోణమూ కూడా రాజీ పడకూడదన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్లో తలెత్తే యుద్ధాల్లో త్రివిధ దళాలను సంయుక్తంగా నిర్వహించాల్సిన ఆవశ్యకతను తాము అర్థం చేసుకున్నామన్నారు.