Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహార, ఇంధన, నిత్యవసరాల ధరలు పైపైకి
- చౌక మొబైల్ ఇంటర్నెట్తో మాకేం లాభం?
- కేంద్రానికి దేశంలోని సామాన్య ప్రజానీకం ప్రశ్న
న్యూఢిల్లీ : మోడీ సర్కారు పాలనలో నిత్యవసరాల ధరలు షాకిస్తున్నాయి. ఇంధన రేట్లు ఆకాశమే హద్దుగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం ఈ ధరలను నియంత్రించటంలో విఫలమైంది. ప్రజల గోడును సైతం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నది. అయితే, ఈనెల 2న దేశంలో 5జీ సేవలను ప్రధాని మోడీ ప్రారంభించారు. గతంలో 1జీబీ డేటా రూ. 300 ఉండగా, ఇప్పుడు ఒక్కో జీబీ రూ. 10కి తగ్గిందని ఆయన గుర్తు చేశారు. నిత్యవసరాల ధరలు పెరుగుతున్న ఈ తరుణంలో మొబైల్ డేటా రేట్లు చౌక రేట్లకే లభిస్తే తమకేం ప్రయోజనమని దేశంలోని సామాన్య ప్రజానీకం ప్రశ్నించారు.దేశంలో టెలికాం రంగంలో బడా కార్పొరేటు సంస్థలు గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తూ భారీ లాభాలను గడిస్తున్నాయని జనం ప్రశ్నిస్తున్నారు. ఈ సంస్థలకు లబ్ది చేకూర్చటానికే మోడీ సర్కారు వ్యవహరిస్తున్నదని వివరించారు. ఇందులో భాగంగానే 4జీ, 5జీ సేవలను తీసుకొచ్చి సదరు సంస్థలకు లాభాల గనిగా మారుస్తున్నారని చెప్పారు. మొబైల్ డేటా గురించి గుర్తు చేసిన మోడీకి దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలు అనుభవిస్తున్న ధరల పోట్ల గురించి తెలియదా? అని ప్రశ్నించారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం గోధుమ పిండి ఆలిండియా సగటు ధర 2016 జూన్‌లో రూ. 24.6 నుంచి ఈ ఏడాది మార్చ్‌కు రూ.31.7కి పెరిగింది. అంతర్జాతీయంగా చమురు ధరల కారణంగా పెట్రోలు ధరలు కూడా అదే విధంగా పెరిగాయి. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ సమాచారం ప్రకారం, జూన్ 2016లో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 65.65గా ఉన్నది. ఈ ఏడాది మార్చి నాటికి అది రూ. 101.81కి చేరటం గమనార్హం. ముఖ్యంగా, ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం బడ్జెట్‌పై ఇంధన ధరల పెరుగుదల తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇంధన ధరల పైనే నిత్యవసరాల ధరలు ఆధారపడి ఉండటమే దీనికి ప్రధాన కారణం.ఇక ఎల్పీజీ సిలిండర్ ధరలు షాకిస్తున్నాయి. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర జూన్ 2016లో రూ. 548.5గా ఉన్నది. 2022 మార్చి నాటికి రూ. 949.50కి పెరిగిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 1,053గా ఉన్నది. కార్పొరేట్ల గురించి చేసే ఆలోచనలో కొంతైనా సామాన్య జనం గురించి ఆలోచిస్తే వారికి ప్రయోజనం చేకూరుతుందని విశ్లేషకులు చెప్పారు.