Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం
- రాష్ట్రాల నుంచి సేకరించిన రిపోర్టును దాఖలు చేయండి
- కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీం
న్యూఢిల్లీ : వృద్ధుల సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రాలను ఆదేశించింది. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ చట్టం, అమలుపై పరిస్థితికి సంబంధించిన నివేదికలను కేంద్ర ప్రభుత్వ అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌కు అందచేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందచేసిన నివేదికలను పరిశీలించి ఒక నెల రోజుల్లోపు అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వృద్ధుల హక్కుల అమలుకు సంబంధించి కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి డాక్టర్ అశ్వనీ కుమార్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా వృద్ధులకు పెన్షన్, ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాలు, వృద్ధుల సంక్షేమం కోసం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని ఆదేశించింది.
ప్రతి జిల్లాలో వృద్ధులకు అందుబాటులో ఉన్న వృద్ధాశ్రమాలు, వైద్య సదుపాయాలు, వృద్ధాప్య సంరక్షణ సౌకర్యాల గురించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అవసరమైన సమాచారాన్ని పొందాలని, దాని నుంచి నివేదికను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎండబ్ల్యూపీ చట్టం నిబంధనలకు ప్రచారం కల్పించడం, చట్టంలోని నిబంధనలు, సీనియర్ సిటిజన్ల రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కుల గురించి సీనియర్ సిటిజన్లకు అవగాహన కల్పించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఎండబ్ల్యూపీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఆదేశాలు జారీ చేయాలనీ, పురోగతిని పర్యవేక్షించే ఉద్దేశ్యంతో సమీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం కూడా పథకాలను పున్ణసమీక్షించి, మరింత వాస్తవికంగా ఉండేలా వాటిని సరిదిద్దాలని ఆదేశించింది. వృద్ధులకు గౌరవంగా జీవించే హక్కును అందుబాటులోకి తెచ్చేందుకు, వారికి అవసరమైన వసతి కల్పించేందుకు రాజ్యాంగ ఆదేశాలు అమలులో పురోగతిని నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. వైద్య సదుపాయాలు, వృద్ధాప్య సంరక్షణ విషయాల్లో దృష్టి కేంద్రీకరించడం, మరింత శక్తివంతమైన ప్రయత్నాలు అవసరమని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణ జనవరి 2023కి వాయిదా వేసింది.