Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్‌తో కలిసి నడక..
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ 'భారత్ జోడో యాత్ర'లో పాల్గొన్నారు. గురువారం ఉదయం కర్నా టకలోని మాండ్య జిల్లాలోని జకన్నహళ్లికి చేరుకొన్నారు. పాండవపుర తాలుకాలో ఉదయం 6.30కు మొదలైన యాత్ర అక్కడకు చేరుకోగానే.. సోనియా కూడా వారితో కలిసి నడిచారు.పాదయాత్రలో తల్లికి షూ లేస్‌లను తనయుడు రాహుల్ సరిచేశారు. ఈ యాత్ర సాయంత్రం 7 గంటలకు నాగమంగళ తాలుకాలో నేడు విరామం తీసుకోనుంది. సోనియాతోపాటు ఈ యాత్రలో స్థానిక మహిళా ఎమ్మెల్యేలు అంజలీ నంబాల్కర్, రూపకళా, లక్ష్మీ హెబ్బాల్కర్‌లు పాల్గొన్నారు. ఈ యాత్ర అనంతరం బ్రహ్మదేవరహళ్లి గ్రామంలో సభ నిర్వహించనున్నారు. ఈ సభ నాగమంగళ తాలుకాలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి ఎదుట ఉన్న మడకె హౌసూరు గేట్ వద్ద జరగనున్నది. యాత్ర వివరాలను కాంగ్రెస్ ట్విటర్లో ఉంచింది. ''ప్రతిజ్ఞ చేసిన వారు వెనక్కి తగ్గరు.. లక్షల కష్టాలు వచ్చినా మనం భారత్‌ను కలుపుదాం.. భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ..'' అని ట్వీట్ చేసింది. దీనికి సోనియా గాంధీ యాత్రలో పాల్గొన్న వీడియోను జత చేసింది.
భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమైంది. ఈ యాత్ర గత శుక్రవారం చామరాజనగర్‌లోని గుండ్లుపేట్ వద్ద కర్ణాటకలో ప్రవేశించింది. ఆదివారం భారీగా తరలివచ్చిన జనసందోహం మధ్య మైసూర్ వద్ద ఓ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. ఈ సందర్భంగా జోరు వానను లెక్కచేయకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. వర్షంలోనే పార్టీలో చేరికల ప్రక్రియ, నేతలంతా కలిసి అభివాదం చేయడం వంటివి చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.