Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎంయూవై లబ్దిదారుల తీరు
- 2016 నుంచి ఇదీ పరిస్థితి
చండీగఢ్ : ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్దిదారులు ఎల్పీజీ ని తక్కువగా వినియోగిస్తున్నారు. పీఎంయూవై కాని వినియోగదారులతో పోలిస్తే తక్కువగా ఉన్నది. పీఎంయూవై లబ్దిదారులు, పీఎంయూవై కాని లబ్దిదారుల వార్షిక ఎల్పీజీ వినియోగానికి మధ్య గణనీయమైన అంతరం ఉన్నది. పీఎంయూవై ను ప్రారంభించిన ఆరేండ్లకు పైగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. ప్రభుత్వ సమాచారంలో ఈ విషయం తెలిసింది. కేంద్ర పథకం విజయం సాధించలేదనటానికి ఈ గణాంకాలే నిదర్శనమని విశ్లేషకులు చెప్పారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనే మూడు చమురు కంపెనీలు (ఓఎంసీలు) నుంచి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద పొందిన సమాచారం ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్లో మొత్తం రూ. 179 కోట్ల సిలిండర్లు 30.5 కోట్ల క్రియాశీల ఎల్పీజీ వినియోగదారులకు విక్రయించబడ్డాయి. ఇందులో తొమ్మిది కోట్ల మంది పీఎంయూవై లబ్దిదారులు ఒక్కో వినియోగదారునికి ఏడాదికి సగటున 3.5 సిలిండర్ల చొప్పున 31 కోట్ల సిలిండర్లను రీఫిల్ చేశారు. మరోవైపు, 21.5 కోట్ల మంది నాన్-పీఎంయూవై వినియోగదారులు 148 కోట్ల సిలిండర్లను ఒక్కో వినియోగదారునికి ఏడాదికి సగటున ఏడు సిలిండర్లను రీఫిల్ చేశారు.
పీఎంయూవై వెబ్సైట్ భారత్లోని 99 శాతం గృహాలు ఇప్పుడు ఎల్పీజీ కనెక్షన్లను కలిగి ఉన్నాయని వివరిస్తున్నది. అయితే, అది వాస్తవానికి భిన్నంగా ఉన్నది. వాస్తవానికి మోడీ సర్కారు ఈ పథకాన్ని 2016లో ప్రారంభించింది. కట్టెలు, బొగ్గు వంటి సాంప్రదాయ వంట ఇంధనాల స్థానంలో గ్రామీణ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందుబాటులో ఉంచటానికి పీఎంయూవై పథకాన్ని ప్రారంభించారు. అయితే, ఈ పథకం మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదనీ, ఇందుకు పీఎంయూవై, ప్రభుత్వ గణాంకాలే నిదర్శనమని విశ్లేషకులు చెప్పారు.