Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజేఐ చర్యను అడ్డుకున్న ఇద్దరు కొలీజియం సభ్యులు
- లేఖ ద్వారా కుదరదు, వ్యక్తిగతంగా చర్చించాల్సిందే
- కొలీజియం సభ్యుల స్పష్టీకరణ
- తదుపరి సీజేఐ పేరు సిఫార్సుకు కేంద్రం లేఖ!
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టుకు నలుగురు న్యాయమూర్తులను నియమించేందుకు సమ్మతి కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ పంపిన లేఖపై సుప్రీంకోర్టు కొలీజియంలోని ఇద్దరు సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ముగ్గురు సిట్టింగ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ఒక సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సీనియర్ న్యాయవాది పదోన్నతులకు సమ్మతిని కోరుతూ ఐదుగురు సభ్యుల న్యాయమూర్తుల ఎంపిక వేదిక కొలీజియంలో తన తోటి న్యాయమూర్తులకు సీజేఐ జస్టిస్ యుయు లలిత్ లేఖ రాశారు. దీంతో కొలీజియంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొలీజియంలో సీజేఐ జస్టిస్ యుయు లలిత్‌తో పాటు నలుగురు సభ్యులు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కెఎం జోసెఫ్ ఉన్నారు. ఆయన పదవీ విరమణ పొందడానికి నెల రోజుల కంటే తక్కువ ఉండటంతో లేఖలో తెలియజేయడం సాధ్యంకాదనీ, అది కొలీజియం నిబంధనలకు విరుద్ధమని ఇద్దరు కొలీజియం సభ్యులు జస్టిస్ యుయు లలిత్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి సిఫారసు చేయడానికి పేర్లపై ఉద్దేశపూర్వకంగా, ఏకాభిప్రాయాన్ని సాధించడానికి సీజేఐ లలిత్ అక్టోబర్ 8 తరువాత కొలీజియం సమావేశాలను నిర్వహించలేరు. జస్టిస్ యుయు లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేస్తారు.
నలుగురి పేర్ల సిఫారసుపై చర్చించి ఖరారు చేసేందుకు సెప్టెంబర్ 30న జరగాల్సిన కొలీజియం సమావేశం భారీ కేసుల కారణంగా రాత్రి 9.10 గంటల వరకు కోర్టులో కూర్చున్నందున జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ జరగలేదు. మరుసటి రోజు అంటే అక్టోబరు 1న శనివారం నుంచి సుప్రీంకోర్టుకు దసరా సెలవులు. అక్టోబర్ 9 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు అక్టోబర్ 10న తిరిగి పున్ణప్రారంభం అవుతుంది. సీజేఐగా యుయు లలిత్‌కు సెలవులు పోనూ ఇంకా 15 రోజులే పని దినాలు మిగిలి ఉన్నాయి. అతని చివరి పనిదినం నవంబర్ 7 అవుతుంది.
దీపావళి సెలవులు అక్టోబర్ 24 నుంచి అక్టోబర్ 29 ఉన్నాయి. అందువల్ల, కోర్టులోని ఐదుగురు సీనియర్ న్యాయమూర్తుల కొలీజియం సెప్టెంబర్ 30న సమావేశం చాలా కీలకమైనది. పదవీ విరమణకు ముందు సమయం లేకపోవడం, కోర్టులో ఇప్పటికే ఐదు ఖాళీలు ఉన్నందున ప్రధాన న్యాయమూర్తి లలిత్ నాలుగు సిఫార్సులను సర్క్యులేషన్ ప్రక్రియతో క్లియర్ చేయాలని తన కొలీజియం సభ్యులకు ప్రతిపాదించారు. అయితే సర్క్యులేషన్ ప్రక్రియతో నలుగురి పేర్లను సిఫారసు చేయడంపై కొలీజియం న్యాయమూర్తుల్లో ఇద్దరు అభ్యంతరం వ్యక్తం చేశారు. పేర్లను కొలీజియం సభ్యులు వ్యక్తిగతంగా చర్చించాలని వారు పేర్కొన్నారు.
కొలీజియం సమావేశం కావడానికి సీజేఐ పదవీ విరమణకు నెల రోజులు కంటే తక్కువ ఉండకూడదనే నియమం ఉంది. అక్టోబర్ 10 తరువాత కొలీజియం సమావేశం ఏర్పాటుచేస్తే, జస్టిస్ యుయు లలిత్ పదవీ విరమణ నెల రోజుల కంటే తక్కువ ఉంటుంది. అందువల్ల ఇద్దరు కొలీజియం సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న రెండు న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి కొలీజియం అనుమతి పొందకుండా తన ముందున్న సీజేఐ జస్టిస్ ఎన్వి రమణను నిరోధించడానికి పదవీ విరమణ నియమం నుంచి నెల కంటే తక్కువ వ్యవధిని ఉదహరించిన జస్టిస్ యుయు లలిత్, ఇప్పుడు అదే నిబంధనను ఎదుర్కొన్నారు.
తదుపరి సీజేఐ పేరు సిఫార్సుకు కేంద్రం లేఖ!
కొలీజియంలోని విభేదాలు నెలకొన్న కీలకమైన సమయంలో తదుపరి సీజేఐ పేరును సిఫార్సు చేయాల్సిందిగా కోరుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్‌కు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఏ సమయంలోనైనా లేఖ రాయనున్నారు. న్యాయ మంత్రి నుండి వచ్చిన లేఖ తదుపరి, 50వ ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రారంభిస్తుంది. సాధారణంగా, న్యాయ శాఖ మంత్రి తన అభ్యర్థనను పంపుతారు. అవుట్గోయింగ్ సీజేఐ పదవీ విరమణకు ఒక నెల సమయం మిగిలి ఉండగానే సిఫార్సును చేస్తారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. అంటే అక్టోబర్ 8లోపు మంత్రి లేఖ రావచ్చు. సీనియారిటీ నిబంధనల ప్రకారం ప్రధాన న్యాయమూర్తిగా తదుపరి వరుసలో జస్టిస్ డివై చంద్రచూడ్ ఉన్నారు.