Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీఆర్ఎస్ నేతలు కోరారు. ఈమేరకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ ధర్మేంద్ర శర్మను టీఆర్ఎస్ నేతలు బి. వినోద్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి కలిసి పార్టీ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానం కాపీని, కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను అందజేశారు. అనంతరం మీడియాతో తెలంగాణ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే తమ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రజా ప్రాతినిధ్యచట్టం సెక్షన్ 29ఎ సబ్ క్లాజ్ 9 ప్రకారం ఒక రాజకీయ పార్టీ పేరు మార్చుకోవచ్చని పేర్కొన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయిన తన పార్టీ పేరు మార్చుకున్నప్పుడు, అడ్రస్ మార్చుకున్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ పేరుతో ఏ రాజకీయ పార్టీ అయిన ఉండవచ్చు, కాని పార్టీ పూర్తి పేరు ముఖ్యమని పేర్కొన్నారు. మూడు, నాలుగు రోజుల్లో ఈసి నుంచి ప్రకటన రావచ్చని, బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు, పార్టీ కార్యాచరణను కేసీఆర్ ప్రకటిస్తారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పేరుతో పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో భవన నిర్మాణం ఆలస్యం అవుతుందనీ, కాబట్టి బీఆర్ఎస్ కార్యకలాపాల కోసం భవనాన్ని అద్దెకు తీసుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్లో జాతీయ స్థాయిలో తన పాత్ర ఏమిటో కేసీఆర్ నిర్ణయిస్తారని తెలిపారు.