Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆధారాలతో సహా ప్రకటించిన అమెరికా సంస్థ
- చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్న మోడీ ప్రభుత్వం
న్యూఢిల్లీ : భారతీయ రైల్వేలో లంచాల పర్వం కొనసాగుతోందని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ ఆధారాలతో సహా నిరూపించినప్పటికీ కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సహజంగానే ప్రతిపక్ష నేతల చిన్నచిన్న నేరాలు, ఆరోపణలపైనే చాలా దూకుడుగా ఉండే మోడీ ప్రభుత్వం, దాని దర్యాప్తు సంస్థలూ ఒక అమెరికా సంస్థ లంచాలపై ఆధారాలతో సహా ప్రకటించి సుమారు 10 రోజులు గడుస్తున్నా.. నిశ్శబ్ధంగా ఉండటం అనేక అనుమానాలకు తావు ఇస్తోంది. ఈ సంఘటన పూర్తి వివరాలు ప్రకారం.. భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీలోని కొంత మంది అధికారులకు అమెరికాకు చెందిన ఒరాకల్ కార్ప్ అనే సంస్థ 4 లక్షల డాలర్లను లంచంగా ఇచ్చినట్లు యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ ఆధారాలతో సహా గతవారంలో ప్రకటించింది. 2016, 2019ల్లో ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది. అయితే దీనిపై కేంద్రం కానీ, రైల్వే శాఖ కానీ ఇప్పటి వరకూ స్పందించలేదు. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ అనే సంస్థ భారత్లో సెబీతో సమానమైనది. ఇలాంటి సంస్థ వెల్లడించినా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడానికి వెనుకాడుతుండటం అనేక అనుమానాలను కలిగిస్తోంది. పైగా దర్యాప్తు ప్రారంభిస్తే పూర్తిగా సహకరిస్తామని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ చెబుతున్నా భారత ప్రభుత్వం స్పందించకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. దీంతో ప్రస్తుత ఉదంతం 2015లో వెల్లడైన లూయిస్ బెర్గర్ లంచం కుంభకోణాన్ని గుర్తుకు తెస్తోంది. 2015లో అమెరికాకు చెందిన నిర్మాణ, కన్సల్టెన్సీ సంస్థ లూయిస్ బెర్గర్ ఇంటర్నేషనల్ గోవా, అస్సాంలకు చెందిన నాయకులకు స్వయంగా లంచాలను ఇచ్చినట్లు వెల్లడించింది. గోవా నాయకులు పేర్లు వ్లెడించకపోయినా 2010లో అప్పడు అస్సాంలో మంత్రులుగా ఉన్న ఫిలిప్ రోడ్రిగ్స్, హిమంత బిస్వా శర్మకు ఈ లంచాలను ఇచ్చామని లూయిస్ బెర్గర్ చెప్పింది. 2010లో ఇద్దరూ నేతలూ కాంగ్రెస్లో ఉన్నా.. తరువాత బిజెపిలో చేరారు. హిమంత శర్మ ప్రసుత్తం అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నారు. లూయిస్ బెర్గర్ లంచం కుంభకోణంపై కూడా విచారణ జరపడానికి మోడీ ప్రభుత్వం ఇష్టపడలేదు.