Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా : బీహార్ ప్రభుత్వం బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేయడంతో వందలాది మంది వైద్యులతో పాటు ఇతర వైద్య సిబ్బంది గురువారం ఆందోళనకు దిగారు. నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్, పాత పెన్షన్ స్కీమ్ సహా తమ 11 పాయింట్లను తీర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బీహార్ హెల్త్సర్వీసెస్ అసోసియేషన్ (బిహెచ్ఎస్ఎ) కింద ప్రభుత్వ వైద్యులు సమ్మెకు పిలుపునిచ్చారు. తాము అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తున్నామని వైద్యులు పేర్కొంటున్నారు. జీతంతో బయోమెట్రిక్ హాజరును అనుసంధానం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పలు ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల కొరత ఉందని, దీర్ఘకాలం పాటు సేవలందిస్తున్న వైద్యులపై ఈ నిబంధన మరింత ఒత్తిడిని తీసుకువస్తుందని బీహెచ్ఎస్ఏ జనరల్ సెక్రటరీ డా. రంజిత్ కుమార్ తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చేంతవరకు సమ్మెను విరమించేది లేదని బిహెచ్ఎస్ఎ హెచ్చరించింది. రాష్ట్రంలో వైద్య సంరక్షణా పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)ఈ ఏడాది నివేదిక ఇచ్చిందని తెలిపింది. పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా ప్రభుత్వాస్పత్రులు, ముఖ్యంగా జిల్లా ఆస్పత్రుల్లో సదుపాయాలు, సిబ్బంది, ప్రణాళిక కొరతతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని నివేదిక పేర్కొంది. వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది సంఖ్య చాతా తక్కువగా ఉందని పేర్కొంది. అయినప్పటికీ ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ఆయా విభాగాలు నోటిఫికేషన్ ఇవ్వలేదని తెలిపింది. ఆస్పత్రుల్లో పడకలు 92 శాతం నుండి 52 శాతానికి పడిపోయాయని.. దశాబ్దం గడుస్తున్నా మంజూరైన స్థాయిలో పడకలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని వివరించింది. సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ సేవలు నిలిచిపోయాయని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.