Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల కమిషన్ ప్రతిపాదనపై సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : ఎన్నికల ప్రణాళికల్లో ఇచ్చిన హామీల అమలుకు రాజకీయ పార్టీలు ఎలా నిధులను సమకూరుస్తాయో వెల్లడించేందుకు, అలాగే దీనివల్ల సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు ఎలా ప్రభావితమవుతాయో వెల్లడించడానికి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సవరించాలన్న ఎన్నికల కమిషన్ ప్రతిపాదన పూర్తిగా అవాంఛనీయమైన చర్య అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలను నిర్వహించాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. అంతేకానీ ప్రజలకు రాజకీయ పార్టీలు వాగ్దానం చేసే సంక్షేమ చర్యలు, విధాన ప్రకటనలను క్రమబద్దీకరించడం ఎన్నికల కమిషన్ కర్తవ్యం కాదని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఇది, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు విశేషాధికారం గల రంగమని పేర్కొంది. రాజకీయ పార్టీల విధాన నిర్ణయాలను ఎన్నికల కమిషన్ నియంత్రించలేదని, అలా చేయడం అధికారా లను అతిగా ఉపయోగించడమే అవుతుందని ఏప్రిల్‌లో సుప్రీం కోర్టుకు అందచేసిన అఫిడవిట్లో ఎన్నికల కమిషన్ పేర్కొంది. అటువంటి ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఈ వివాదాస్పద వైఖరి తీసుకోవడం ఆశ్చర్యకరంగా వుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ప్రభుత్వం తీసుకువచ్చిన ఒత్తిడి మేరకే ఇదంతా జరుగుతోందా అని ప్రశ్నించింది. ప్రజల ఆందోళనలను పరిష్కరించేందుకు, వారి సమస్యలను పరిష్కరించే విధానపరమైన చర్యలను సూచించేందుకు రాజకీయ పార్టీల హక్కును పరిమితం చేసే లేదా నియంత్రించే ప్రయత్నా లను సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది.