Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖపట్నం : వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని కలిసేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్టు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు తెలిపారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 603వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో కూర్చున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులనుద్దేశించి నాయకులు మాట్లాడారు. ఈ నెల 18 నుంచి 21 వరకు అనంతపురం పరిసర ప్రాంతాల్లో భారత్ జోడో యాత్ర చేపడుతున్న రాహుల్ గాంధీని కలిసి విశాఖ ఉక్కు ప్రయివేటుపరం కాకుండా అడ్డుకోవాలనీ, పార్లమెంట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని ఉక్కు కార్మికులు కోరనున్నారని తెలిపారు. గత పార్లమెంట్ సమావేశాలులో అన్ని పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు, ఫ్లోర్ లీడర్లకు ఉక్కు పరిరక్షణపై వినతిపత్రాలు సమర్పించామనీ, ఆ సమయంలో అనివార్య కారణాల వల్ల రాహుల్ గాంధీని కలవలేక పోయామని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, వేణుగోపాల్, శశిథరూర్, జెడి శీలం తదితర నాయకులను కలిసి ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని కోరామన్నారు. దీక్షలో పాల్గొన్న వారిలో పోరాట కమిటీ నాయకులు డి ఆదినారాయణ, జె రామకష్ణ, పరంధామయ్య, గుమ్మడి నరేంద్ర, దాసరి శ్రీనివాస్, సత్యనారాయణ, ఎ వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, పి శ్రీనివాస్ పాల్గొన్నారు.