Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ డిమాండ్
- పది రోజుల్లోగా రాత పూర్వక అభిప్రాయం చెప్పండి
న్యూఢిల్లీ :పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్స్ వ్యవహారం నాలుగు రాష్ట్రాల మధ్య రగడగా మారింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గతనెల 29న తెలంగాణ, ఏపీ,ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగి భేటిలో సాంకేతిక అంశాలపై చర్చించారు. సీడబ్ల్యూసీ చైర్మెన్ ఆర్కె గుప్తా అధ్యక్షతన పోలవరం ప్రభావిత నాలుగు రాష్ట్రాల సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సుదీర్ఘంగా దాదాపు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది. ఇందులో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఆయా రాష్ట్రాలు సాంకేతికపరమైన అభిప్రాయాలు, వాదనలు వినిపించాయి. పోలవరం ప్రాజెక్టుపై సాంకేతిక అభిప్రాయాలు, వాదనలను పది రోజుల్లో రాత పూర్వకంగా నాలుగు రాష్ట్రాలు సమర్పించాలని సీడబ్ల్యూసీ కోరింది. సుప్రీం కోర్టులో డిసెంబర్ 7న జరిగే విచారణ లోపు మరో రెండు సార్లు సమావేశాలు నిర్వహించనున్నట్టు సీడబ్ల్యూసీ ప్రకటించింది.
పీఎంఎఫ్తో బ్యాక్బాటర్ నిర్థారణకు 'నో'
తొలుత సీడబ్ల్యూసీ చైర్మెన్ ఆర్కె గుప్తా మాట్లాడుతూ స్పిల్‌వే ద్వారా వచ్చే వరద, స్టాండర్డ్ ప్రొజెక్టడ్ వరద (ఎస్పీఎఫ్), గరిష్ట వరద ప్రవాహం (పీఎంఎఫ్)తో బ్యాక్ వాటర్ ప్రభావం గురించే రాష్ట్రాలు ప్రధానంగా ఆందోళనలు చెందుతున్నాయని అన్నారు. గోదావరి నదీ జలాల వివాదం ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) అవార్డు ప్రకారం వరద ప్రభావిత ప్రాంతాలకు అందించాల్సిన రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాయని తెలిపారు. పీఎంఎఫ్ కారణంగా బ్యాక్ వాటర్ ప్రభావం పరిగణనలోకి తీసుకోబోమంటూ తిరస్కరించారు.
పీఎంఎఫ్ ఎంతో ఖరారు చేయాల్ణి ఛత్తీస్‌గఢ్
ఐఐటీ రూర్కీతో పాటు ఆయా అధ్యయనాలు పీఎంఎఫ్ 58 లక్షల క్యూసెక్కుల వరకు ఉన్నట్టు నివేదించిదనీ, అందువల్ల డిజైన్, బ్యాక్ వాటర్ ప్రభావం కోసం పీఎంఎఫ్ ఏమేరకు ఉంటుందో ఖరారు చేయాలని ఛత్తీస్‌గఢ్ విజ్ఞప్తి చేసింది.
బ్యాక్ వాటర్‌ను ఖరారు చేస్తేనే
ప్రజాభిప్రాయ సేకరణ ా ఒడిశా
స్పిల్‌వే డిజైన్, బ్యాక్ వాటర్ ప్రభావం రెండింటికీ 58 లక్షల క్యూసెక్కుల పీఎంఎఫ్ను పరిగణనలోకి తీసుకోవాలని ఒడిశా కూడా నొక్కి చెప్పింది. సీడబ్ల్యూసీ, ఆంధ్రప్రదేశ్ బ్యాక్‌వాటర్ అధ్యయనం, ఆపరేషన్ ప్రోటోకాల్, హైడ్రాలజీ, దాని సౌలభ్యం పరికల్పన కోసం చట్టబద్ధమైన క్లియరెన్స్‌లలో కూడా ఒరిస్సా తన పరిమితులను నొక్కి చెప్పింది. ఈ విషయాలను పరిష్కరించి, ఖరారు చేశాకే ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ హియరింగ్), ఉమ్మడి సర్వే (జాయింట్ సర్వే) చేయాలని కోరింది.
ఉమ్మడి సర్వే చేయాల్ణి తెలంగాణ
సీడబ్ల్యూసీ అంచనా వేసిన బ్యాక్ వాటర్‌కి, వాస్తవంగా క్షేత్రస్థాయిలో వచ్చిన బ్యాక్ వాటర్‌కి మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉందని పేర్కొంది. అందుకనే తాజాగా బ్యాక్ వాటర్ అధ్యయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నొక్కి చెప్పింది. ఇటీవలి జులైలో వచ్చిన వరద ప్రభావాన్ని ఉదహరించింది. 103 గ్రామాల పరిధిలో 11 వేల కుటుంబాలు, 28 వేల మంది నివాసితులు ప్రభావానికి గురయ్యారని తెలిపింది. దీని ప్రకారం బ్యాక్ వాటర్ అధ్యయనం చేయాలని కోరింది. అలాగే పూర్తి రిజర్వాయర్ నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్) వద్ద నీటిని నిలబెట్టి, నిర్వహించినప్పుడు నిల్వ జలాల ప్రభావాన్ని కూడా తెలంగాణ ఎత్తిచూపింది. మురుగు నీరు రద్దీ, మునిగిపోవడం వల్ల ఏడు మండలాలు ప్రభావితం అయ్యాయనీ, దాదాపు 150 గ్రామాల్లో 50 వేల ఎకరాలు ప్రభావితం అయ్యాయని తెలిపింది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని క్షేత్రస్థాయి ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది. సీడబ్ల్యూసీ నివేదికలతో పోల్చితే ఈ జులైలో వచ్చిన వరద వల్ల బ్యాక్ వాటర్ చాలా తేదా కనిపిస్తున్నదని చెప్పింది. బ్యాక్ వాటర్ కారణంగా పోలవరం ఎగువన నీరు నిల్వ ఉంటుందనీ, ఇది సీడబ్ల్యూసీ కూడా అంగీకరించిందని పేర్కొంది. ఈనేపథ్యంలో గోదావరి నది అన్ని ప్రధాన పునాదులు కవర్ చేసేలా సంయుక్త సర్వే చేయాలని డిమాండ్ చేసింది.
ఉల్లంఘనలేమీ లేవ్ణు ఆంధ్రప్రదేశ్
గోదావరి ట్రిబ్యునల్ అవార్డు మేరకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నదనీ, అందులో ఎలాంటి ఉల్లంఘనలు లేవని ఏపీ ప్రభుత్వం తెలిపింది. సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులు ప్రకారం నిర్మాణం కొనసాగుతున్నదనీ, దీనిలో ఎటువంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది. సీడబ్ల్యూసీ ఇచ్చిన పోలవరం డిజైన్, నీటి విడుదల తదితర వాటిల్లో మార్పులు చేయలేదని పేర్కొంది. తాము ఎలాంటి సర్వేలకైనా సిద్ధమేనని స్పష్టం చేసింది. అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టేందుకు, సహకరించేందుకు ఏపి కూడా అంగీకరించింది. ఉమ్మడి సర్వేను సక్రమంగా చేపడితే తమకు అభ్యంతరం లేదని పేర్కొంది.
ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఎ) చైర్మెన్ చంద్రశేఖర్ అయ్యర్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) సి.నారాయణ రెడ్డి, పోలవరం చీఫ్ ఇంజినీర్ (సీఈ) సుధాకర్ బాబు, తెలంగాణ నుంచి ఈఎన్సిలు సి. మురళీధర్, బి.నాగేంద్రరావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, కొత్తగూడెం చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరెడ్డి, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్యం ప్రసాద్, కన్సల్టెంట్స్ రాకేష్ రౌతు, ఒరిస్సా నుంచి ఈఎన్సి అశుతోష్ దాస్, చీఫ్ ఇంజినీర్లు సాగర్ మొహంతి, ఉపేంద్ర సేథి, కన్సల్టెంట్ త్రివిక్రమ్ ప్రధాన్, ఛత్తీస్‌గఢ్ ఈఎన్సీ వికె ఇంద్రజీత్, చీఫ్ ఇంజినీర్ ఆర్కె నగారియా పాల్గొన్నారు.