Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందువులు, ముస్లిముల మధ్య చీలికల కోసమే ఈశాన్య ఢిల్లీలో మత హింస
- పౌరుల కమిటీ నిర్ధారణ
న్యూఢిల్లీ : భారతదేశంలో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం క్షీణించడం పట్ల సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులతో సహా పలువురు ప్రముఖులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా జీవనంలో ఎదురవుతున్న విద్వేష ప్రచారం, ద్వేషపూరితమైన సందేశాలు, సమాచారానికి వ్యతిరేకంగా వ్యవహరించడానికి సంస్థాగతమైన సంకల్పం కొరవడడంతోపాటు, వాటిని పెడచెవిన పెట్టడంతో దేశవ్యాప్తంగా మైనారిటీలకు వ్యతిరేకంగా హింస పెరుగుతోందని వారు అభిప్రాయపడ్డారు. 'అనిశ్చితిలో న్యాయం : ఈశాన్య ఢిల్లీ హింసాకాండ 2020పై పౌరుల కమిటీ నివేదిక' పేరుతో కానిస్టిట్యూషనల్ కండక్ట్ గ్రూపు ఈ నివేదికను వెలువరించింది. ఈ గ్రూపులో సిటిజన్స్ కమిటీ చైర్పర్సన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకూర్, మద్రాస్, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎపి షా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ఎస్ సోధి, పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అంజనా ప్రకాష్, రిటైర్డ్ ఐఏఎస్ జికె పిళ్లై, పలువురు మాజీ ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయమూర్తులు ఉన్నారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు ఉధృతంగా ఉన్నప్పుడు దేశ రాజధానితో సహా ఈశాన్య ఢిల్లీలో మత హింస చెలరేగింది. ఆ హింసాకాండలో 53మంది మరణించారు. వారిలో ఎక్కువమంది ముస్లింలే. ఈ ఘటనలపై నివేదికను ఇటీవల మూడు భాగాలుగా సిటిజన్స్ కమిటీ విడుదల చేసింది. హింసకు సంబంధించిన వివిధ కోణాలను ఇందులో పరిశీలించారు. ఈ హింసాకాండకు చాలా నెలలు ముందుగానే హిందూ, ముస్లిముల మధ్య చీలికలు తెచ్చేందుకు, ముఖ్యంగా ముస్లిములపై విద్వేషాన్ని రగిల్చేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరిగాయని ఆ నివేదిక పేర్కొంది. సీఏఏను తీసుకొచ్చిన నేపథ్యంలో పౌరసత్వం కోల్పోతామనే భయాందోళనలతో ముస్లిం కమ్యూనిటీ సతమతమవుతోంది. 2019 డిసెంబరు మధ్య నాటికి ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఈశాన్య ఢిల్లీ ఇందుకు ప్రధాన కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వూపందుకుందని ఆ నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితుల్లో సీఏఏపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ బీజేపీ ఎన్నికల ప్రచారం చేపట్టింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలంటే అవి జాతి వ్యతిరేక, హింసాత్మక నిరసనలేనని ముద్ర వేసింది. నిరసనకారులను దేశద్రోహులుగా పేర్కొంటూ అనురాగ్ ఠాకూర్, కపిల్ మిశ్రా వంటి బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేశారు.
కొన్ని టివి ఛానళ్లు, సోషల్ మీడియాపై తీవ్ర అసంతృప్తి
ఈ వ్యవహారంలో కొన్ని జాతీయ టెలివిజన్ చానెళ్లు, సామాజిక మాధ్యమాల పాత్ర పట్ల నివేదిక తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్వేషాన్ని మరింత రగిల్చేలా వ్యవహరించాయని పేర్కొంది. నిరసనలను దూషించడం పట్ల నివేదిక విచారం వెలిబుచ్చింది. 2019 డిసెంబరు-2020 ఫిబ్రవరి మాసాల మధ్య రిపబ్లిక్, టైమ్స్ నౌ, ఆజ్ తక్, జీ న్యూస్, ఇండియా టివి, రిపబ్లిక్ భారత్ (హిందీ) వంటి ఆరు టెలివిజన్ చానళ్లు విద్వేషాన్ని మరింత పెచ్చరిల్లేలా చేయడంలో కీలక పాత్ర పోషించాయని నివేదిక పేర్కొంది. వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సంబంధిత పోస్టులను కూడా పరిశీలించామని ఆ నివేదిక తెలిపింది. సీఏఏ చుట్టూ జరుగుతున్న సంఘటనలన్నింటికీ హిందువులు వర్సెస్ ముస్లింల కోణాన్ని ఆపాదిస్తూ, ముస్లింల పట్ల అనుమానాలను తలెత్తేలా చేసేలా ఈ చానళ్ల రిపోర్టింగ్ వుందని గ్రూపు విశ్లేషణలో వెల్లడైంది. నిరాధారమైన కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేయడం, సీఏఏ వ్యతిరేక నిరసనలను దూషించడం వంటి చర్యలకు పాల్పడ్డాయని పేర్కొంది. ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించడానికి, వారిపై హింసకు పాల్పడాలని సమాజంలో మెజారిటీ వర్గం పిలుపిచ్చేందుకు దోహదపడేలా వాతావరణాన్ని సృష్టించేందుకు విద్వేషం ప్రబలడం దోహదపడిందని నివేదిక నిర్ధారించింది.