Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష ఉన్నట్టా? లేనట్టా?
- 2022లో పథకం కొనసాగింపుపై ఆదేశాలివ్వని కేంద్రం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన 'నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష'ను (ఎన్టీఎస్) కేంద్రం నిలిపివేసింది. దీంతో వేలాది మంది విద్యార్థులు స్కాలర్షిప్కు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది స్కాలర్షిప్ పథకం కొనసాగించాలా? వద్దా ? అన్నదానిపై కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని, అందువల్లే ప్రతిభావంతుల ఎంపిక నిమిత్తం నిర్వహించే పరీక్షను నిలిపివేశామని 'నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్' (ఎన్సీఈఆర్టీ) శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఎన్టీఎస్ పూర్తిగా కేంద్ర ప్రాయోజిత పథకం. నిధులు పూర్తిగా కేంద్రం నుంచి విడుదల చేయాల్సి వుంటుంది. ఎన్టీఎస్ను ప్రతిఏటా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రెండుమార్లు నిర్వహిస్తున్నారు. ''నేషనల్ టాలెంట్ సెర్చ్ పథకం పూర్తిగా కేంద్ర ప్రాయోజిత పథకం. కేంద్ర విద్యాశాఖ నిధులు కేటాయించాలి. పథకాన్ని అమలుజేసే బాధ్యత ఎన్సీఈఆర్టీ ఏజెన్సీకి అప్పజెప్పారు. మార్చి 31, 2021 వరకే పథకం అమలుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. అందువల్లే ఈ ఏడాది పథకం కొనసాగిస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఇప్పుడున్న పద్ధతిలోనే పథకం కొనసాగించాలంటే కేంద్రం నుంచి గ్రీన్‌సిగల్ రావాల్సి ఉంటుంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పరీక్షను నిలిపివేశా''మని ఎన్సీఈఆర్టీ అధికారికంగా తెలిపింది. ఎన్సీఈఆర్టీ కౌన్సిల్లో సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, స్కాలర్షిప్ పథకం అమలుపై సమీక్ష చేస్తున్నట్టు తెలిసింది. టాలెంట్ సెర్చ్ పరీక్షలో సమూల మార్పులు చేయాలనే అంశంపై చర్చ జరుగుతోందని, స్కాలర్షిప్ సంఖ్య పెంచాలనేదానిపైనా, సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు లబ్దిపొందేట్టు చేయాలనేదానిపైనా చర్చలు సాగుతున్నాయని ఆయన అన్నారు. అయితే తుది నిర్ణయం ఎప్పుడు వెలువడు తుందనేది చెప్పలేమని అన్నారు. టాలెంట్ సెర్చ్ పరీక్ష దేశవ్యాప్తంగా హిందీ, ఇంగ్లీష్, 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. ప్రతిఏటా 2వేలమంది విద్యార్థుల్ని ఈ పథకం కింద ఎంపిక చేస్తున్నారు.