Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబర్‌లో కోటీ 67 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తు
- వ్యక్తిగత కేటగిరిలో దరఖాస్తులు 2కోట్ల పైమాటే..
- ఉపాధి సంక్షోభం లేదని చూపే ప్రయత్నం : సామాజిక కార్యకర్తలు
- వర్క్ డిమాండ్‌ను తగ్గిస్తూ కేంద్రం గణాంకాలు విడుదల
- రాష్ట్రాలకు ఆలస్యంగా నిధులు..
గ్రామాల్లో ఉపాధి సంక్షోభం పేద ప్రజల్ని వెంటాడుతోంది. కోవిడ్ సంక్షోభంలో ఉపాధి కోల్పోయిన అనేకమంది సరైన పనిలేక అల్లాడుతున్నారు. ఉపాధి పనుల కోసం దరఖాస్తు చేసుకుంటే..పట్టించుకునే నాథుడే లేడు. దీనికి కారణం నరేగా చట్టం (ఉపాధి హామీ పథకం) అమలుపై మోడీ సర్కార్ అనుసరిస్తున్న ధోరణి. గణాంకాల్ని తగ్గించి చూపుతూ..ఉపాధి సంక్షోభం లేదని చూపెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తోందని సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు. చట్టం అమలులో పారదర్శకత లోపించిందన్నారు. తాజా గణాంకాల ప్రకారం..'వర్క్ డిమాండ్' సెప్టెంబర్‌లో 5శాతం పెరిగింది. వ్యక్తిగత, కుటుంబ కేటగిరిల్లో వర్క్ డిమాండ్ అనూహ్యంగా ఉంది. అయినప్పటికీ పథకం అమల్లో నిధుల విడుదల చాలా ఆలస్యమైందని నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : వర్క్ డిమాండ్‌ను బట్టి 'నరేగా' కింద ఈ ఏడాది కనీసం రూ.2.64 లక్షల కోట్లు అవసరమవుతాయి. కానీ మోడీ సర్కార్ రూ.73వేల కోట్లు కేటాయించింది. గ్రామీణ ఉపాధి సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే ఈ నిధులు సరిపోవని, కేటాయించిన నిధులను సైతం చాలా ఆలస్యంగా రాష్ట్రాలకు విడుదల అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్న (నైపుణ్యం లేని మాన్యువల్ పని) ప్రతి గ్రామీణ కుటుంబంలో ఒక్కరికైనా కనీసం 100 రోజుల వేతన ఉపాధి కల్పించాలని 'నరేగా చట్టం' చెబుతోంది.
సంక్షోభాన్ని దాచే ఎత్తుగడ
గత మూడు నెలలుగా నరేగా పథకం కింద ఉపాధి హామీ పనుల కోసం గ్రామాల్లో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. క్రితం ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌తో పోల్చితే ఈ ఏడాదిలో దరఖాస్తులు లక్షల్లో పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి సంక్షోభానికి ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయని నిపుణులు విశ్లేషించారు. ఉపాధి సమస్య లేదని చూపేందుకే గణాంకాల్ని కేంద్రం చాలా వరకు తగ్గించి చూపుతోందని అన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో, 'నరేగా పథకాన్ని రాష్ట్రాలు అమలుజేస్తున్నాయి. కేరళ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సహా మరో నాలుగు రాష్ట్రాలకు ఈ ఏడాది నిధుల విడుదల చాలా ఆలస్యమైంది. రెండో త్రైమాసికం ముగిసినా (సెప్టెంబర్) దీనికి సంబంధించిన నిధులు ఇంకా రావటం లేదు. రాజ్యసభలో మాత్రం కేవలం పశ్చిమ బెంగాల్‌కు మాత్రమే నిధుల విడుదల ఆలస్యమైందని కేంద్రం చెప్పుకొచ్చింది. వేతనాల జాప్యం కారణంగా పథకం అమలుపై విశ్వాసం దెబ్బతింటోంది.
వర్క్ డిమాండ్‌ను కేంద్రం అణచివేసింది
''ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పథకానికి తగిన నిధులు కేటాయించనందున వర్క్ డిమాండ్‌ను చాలా వరకు అణచివేశారు. నరేగా చట్టంలో మౌలిక స్వభావాన్ని కేంద్రం గౌరవించటం లేదు. గత సంవత్సరంలో లాగే..ఈ ఏడాదీ రాష్ట్రాలకు నిధులు ఆలస్యంగా విడుదల చేశారు''అని ఎన్జీవో సంస్థ మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ వ్యవస్థాపక సభ్యుడు నిఖిల్ డే అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా లేదా ఉపాధి హామీ) వెబ్సైట్లో కేంద్రం విడుదల చేసిన గణాంకాలు పరిశీలిస్తే, కుటుంబ దరఖాస్తుల కేటగిరిలో పని డిమాండ్ కోసం దాదాపు ఒక కోటీ 67 లక్షలు వచ్చాయి. వ్యక్తిగత కేటగిరిలో 2 కోట్లా 2 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. కోవిడ్‌కు ముందు, తర్వాత గణాంకాలతో పోల్చితే పని కోసం డిమాండ్ గణనీయంగా కనపడుతోంది.
- నిఖిల్ డే, మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్