Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాధికారాలు విస్తృతంగా పెరుగుతాయి
- ట్రాయ్, టీడీఎస్ఏటీ పాత్ర తగ్గుతుంది
- టెలికాం బిల్లు ముసాయిదాపై నిపుణులు
న్యూఢిల్లీ: భారత్‌లో టెలికాం బిల్లు ముసాయిదాపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దీని ద్వారా బడా కంపెనీల గుత్తాధిపత్యం పెరుగుతుందన్నారు. ప్రభుత్వాధికారాలు విస్తృతమవుతాయని చెప్పారు. ప్రజల అభిప్రాయం కోసం ప్రభుత్వం ఇటీవల ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్లు 2022 ముసాయిదాను విడుదల చేసిన విషయం విదితమే. ఇది ఐదేండ్లుగా తయారు చేస్తున్న వ్యక్తిగత డేటా రక్షణ (పీడీపీ) బిల్లు ఉపసంహరణను అనుసరిస్తుంది. గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు పుట్టుస్వామి తీర్పు ఆధారంగా పీడీపీ బిల్లు పౌరుల గోప్యత హక్కుల కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందించింది. అయితే, ఈ చర్యలు పౌరుల హక్కులు నిర్వచించబడలేదని సూచిస్తున్నాయి. అయితే, పౌరులు ఏమి చేయగలరు? ఏమి చూడగలరు? ఏది వినగలరు? అనే దానిపై ప్రభుత్వానికి అధికారాలు విస్తృతంగా పెరుగుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది టెలికాం కంపెనీల గుత్తాధిపత్యానికి బహుమతిగా అభివర్ణించారు.
ముసాయిదా టెలికాం బిల్లు పౌరులు, సర్వీసు ప్రొవైడర్లపై ప్రభుత్వ అధికారాలను పెంచటమే కాకుండా, స్వతంత్ర రంగ నియంత్రణ సంస్థ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), టెలికాం వివాద పరిష్కారం, వివాద ట్రిబ్యునల్ (టీడీఎస్ఏటీ) పాత్రను గణనీయంగా తగ్గిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు 1885 ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టాన్ని భర్తీ చేయటానికి ప్రయత్నిస్తుంది. పౌరులపై కేంద్ర ప్రభుత్వ అధికారాలను విస్తరించటానికి మోడీ సర్కారు ఈ ధోరణిని కొనసాగిస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. తన పోలీసింగ్ అధికారాలను విస్తరించటం, నిఘా నిర్మాణాన్ని రూపొందించటం మోడీ సర్కారు ఉద్దేశంగా కనిపిస్తున్నదని చెప్పారు. ఇది అన్ని సర్వీసు ప్రొవైడర్లు తమ యూజర్ డేటాను ప్రభుత్వంతో పంచుకోవాలని ఒత్తిడి చేస్తుందన్నారు.
సాధ్యంకాని నియమాలను రూపొందించటానికి కేంద్రం యత్నిస్తున్నదని ఆరోపించారు. ముసాయిదా బిల్తుతో పెద్ద కంపెనీలు లాభపడతాయన్నారు. ఈ రంగంపై ఈ కంపెనీల గుత్తాధిపత్యం పెరుగుతుందని నిపుణులు హెచ్చరించారు. అయితే, ఈ బిల్లుపై ట్రారు స్పందన ఎలా ఉంటుందో ఎదురు చూడాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. అయితే, పేరుకు స్వతంత్ర సంస్థ అయినప్పటికీ ఇది ప్రభుత్వం ఏది చెప్తే అదే చేస్తుందన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు, పౌర సమాజమూ కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన అవసరమున్నదని చెప్పారు.