Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్
న్యూఢిల్లీ : రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని భారత్కు ఎవరూ చెప్పలేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. దేశ ప్రజలకు ఇంధనం అందజేయాల్సిన నైతిక బాధ్యత భారత ప్రభుత్వంపై ఉందని, అందువల్ల ఎక్కడ నుంచైనా చమురు కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ రకమైన చర్చను ప్రజల వద్దకు తీసుకెళ్లడం సాధ్యం కాదన్నారు. అమెరికా ఇంధన శాఖ మంత్రి జెన్నిఫర్ గ్రాన్హామ్తో ద్వైపాక్షిక సమావేశానంతరం కేంద్ర మంత్రి వాషింగ్టన్లో మాట్లాడారు. ''మీ విధానం పట్ల మీరు స్పష్టంగా వున్నట్లైతే, అంటే ఇంధన భద్రత, ఇంధన స్థోమతలో మీకు నమ్మకం వుంటే, ఇంధన వనరులు ఎక్కడున్నా అక్కడ నుంచి మీరు కొనుగోలు చేయవచ్చు.'' అని మంత్రి వ్యాఖ్యానించారు. రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లపై చాలా తప్పుడు అభిప్రాయాలున్నాయన్నారు. యూరప్ దేశాలు ఒక్క పూటలో కొనుగోలు చేసే మొత్తాన్ని భారత్ మూడు మాసాల్లో కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రష్యా నుంచి 0.2శాతం చమురునే దిగుమతి చేసుకున్నామని చెప్పారు. మార్కెట్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఫిబ్రవరిలో, ఆ తర్వాతి మాసాల్లో రష్యా నుంచి దిగుమతులు మరింత పెరిగాయన్నారు.