Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీఘడ్: ఆయుధ వ్యవస్థ ఆపరేటర్లకు కొత్త శాఖను భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఏర్పాటు చేసింది. పదాతిదళ, వైమానిక వ్యవస్థల్లోని నిపుణులందరికీ ఒకే వేదిక వుండేలా ఆయుధ వ్యవస్థ ఆపరేటర్లందరినీ ఏకీకరణ చేయడం ఈ చర్య ఉద్దేశంగా వుంది. స్వాతంత్య్రం లభించిన తర్వాత వైమానిక దళంలో కొత్త నిర్వహణా శాఖను ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణులు, రిమోట్ పైలటెడ్ విమానం, ఇద్దరు, పలువురు సిబ్బంది వుండే విమానాల్లోని ఆయుధ వ్యవస్థల ఆపరేటర్లు మొత్తంగా ఈ నాలుగు విభాగాలను ఒక తాటిపైకి తీసుకురావడమే కీలకమని ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి తెలిపారు. శనివారం ఎయిర్ ఫోర్స్ డే పరేడ్ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ శాఖను ఏర్పాటు చేయడం వల్ల విమానాలు నడపడంలో శిక్షణపై ఖర్చు తగ్గుతున్న కారణంగా మొత్తంగా రూ.3,400 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. ఆధునిక, సౌకర్యవంతమైన, సానుకూల సాంకేతికతలతో సాంప్రదాయ వ్యవస్థలను, ఆయుధాలను మెరుగుపరచాల్సి వుందని చెప్పారు.
వచ్చే ఏడాది నుంచి మహిళా అగ్నివీరులు
వచ్చే ఏడాది నుంచి వైమానిక దళంలోకి మహిళా అగ్నివీరుల్ని తీసుకుంటామని వివేక్ రామ్ చౌదరి తెలిపారు. ప్రతీ అగ్నివీర్కూ ఎయిర్ ఫోర్సులో చేరడానికి ముందే సరైన నైపుణ్యాలు ఉండే విధంగా శిక్షణాపద్దతిని మార్చామన్నారు. ఈ సంవత్సరం డిసెంబర్లో.. ప్రాథమిక శిక్షణ కోసం మూడు వేల మందిని తీసుకోనున్నట్లు తెలిపారు. కొత్త యుద్ధ యూనిఫామ్‌ను కూడా ప్రదర్శించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండ్‌ను ఇటీవల వైమానిక దళంలోకి ప్రవేశపెట్టినట్లు తెలిపారు.