Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రక్కును ఢీకొట్టిన బస్సు
- నాసిక్-ఔరంగాబాద్ హైవేపై ఘటన
- 11 మంది సజీవ దహనం
నాసిక్ : మహారాష్ట్రలోని నాసిక్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు స్లీపర్ బస్సుకు నిప్పంటుకోవడంతో చిన్నారిసహా 11 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నాసిక్ - ఔరంగాబాద్ హైవేపై డీజిల్ ట్రక్కును ప్రైవేటు బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని నాసిక్ మున్సిపల్ కమిషనర్ చంద్రకాత్ పుల్కుంద్వార్ తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరూ స్థానిక ఆసుపత్రి ఐసియు వార్డులో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ముంబై నుంచి యవత్మాల్ వెళ్తున్న ఈ బస్సు స్లీపర్ కోచ్ కావడం, పైగా తెల్లవారుజాము కావడంతో ఎక్కువమంది నిద్రపోతున్నారని తెలిపారు. గాయపడిని వారందరినీ వెంటనే సమీప ఆస్పత్రికి తరలించామని నాసిక్ డిప్యూటీ కమిషనర్ అమోల్ టాంబే తెలిపారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. పెద్ద అగ్నిగోళంలా బస్సు మండుతుండడం వీడియోల్లో కనిపిస్తోంది. మంటలను వెంటనే ఆర్పడానికి అధికారులు ప్రయత్నించారు. తెల్లవారు జామున 5.15గంటలకు ప్రమాదం జరిగిందని, వెంటనే తాము పోలీసులను, అంబులెన్సులను పిలిపించామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొందరు కిటికీ నుంచి దూకి తప్పించుకున్నారని, మంటలు చాలా తీవ్రంగా వుండడంతో మిగిలిన ప్రయాణికులను కాపాడడం చాలా కష్టమైందని చెప్పారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున ప్రధాని నరేంద్ర మోడీ నష్టపరిహారం ప్రకటించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున నష్టపరిహారం అందజేస్తామని, క్షతగాత్రుల చికిత్సకు అయ్చే ఖర్చులు భరిస్తామని తెలిపారు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్‌సహా సీనియర్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.