Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూమి నుంచే చంద్రుడు ఏర్పడింది : ఇస్రో
- చంద్రుడి ఉపరితలంపైకి సోడియం అణువులు చేరుతున్నాయి..
- వెలుగుతున్న తీరుకు కారణం ఇదే
న్యూఢిల్లీ : భూమి నుంచి విడిపోయి..ఉపగ్రహంగా చంద్రుడు ఏర్పడ్డాడనేది శాస్త్రవేత్తల అంచనా. దీనిని నిరూపించే సరికొత్త ఆధారాలు లభించాయని ఇస్రో తాజాగా ప్రకటించింది. చంద్రుడిపైన మట్టి, రాతిశిలల నుండి ఉపరితలంపైకి సోడియం అణువులు నిరంతరం చేరుతున్నాయని మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది. అందువల్లే చంద్రుడు వెలుగుతున్న తీరు ప్రత్యేకంగా ఉందని తెలిపింది. ఈ విషయాన్ని తొలిసారిగా చంద్రయాన్-2 ఆర్బిటర్ గుర్తించింది. దీనికి సంబంధించిన వివరాల్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా మీడియాకు విడుదల చేసింది.
భూమి, చంద్రుడు ఒకటే గోళం
అపొలో-11 ప్రయోగంతో (1969లో) చంద్రుడిపై అడుగుపెట్టిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, మరో ఇద్దరు వ్యోమగాములు అక్కడ్నుంచి మట్టి, రాళ్లను భూమి పైకి తీసుకొచ్చారు. దీంట్లో భూమిపైన మట్టి, రాళ్లలో ఉన్నట్టుగానే సిలికాన్, ఇతర ఖనిజాలున్నాయి. అయితే చంద్రుడి మట్టి, రాళ్లలో సోడియం చాలా తక్కువగా ఉంది. దీంతో భూమి నుంచి చంద్రుడు ఏర్పడ్డాడనే సిద్ధాంతానికి సవాల్ ఏర్పడింది. ఈ సందేహాన్ని పటాపంచలు చేస్తూ..దీనికి కారణం తెలిసిందని ఇస్రో వెల్లడించింది. చంద్రుడి మట్టి, రాళ్లలోని సోడియం అణువులు నిరంతరం అక్కడ ఉపరితలానికి చేరుతున్నాయి. అందువల్లే నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఇతర వ్యోమగాములు తెచ్చిన వాటిలో కాల్షియం మోతాదు ఎక్కువైందని, సోడియం తక్కువైందని ఇస్త్రో శాస్త్రవేత్తలు గుర్తించారు.
సూర్యుడి నుంచి వచ్చే రేడియో ధార్మిక కిరణాల తాకిడికి చంద్రుడిపై మట్టి, రాతి శిలల నుంచి సోడియం అణువులు విడిపోయి..ఉపరితలంపైకి చేరుతున్నాయని, తద్వారా ఎక్సోస్పియర్ (అత్యంత బలహీనమైన , పలుచనైన వాతావరణం) ఏర్పడుతోందని అంచనావేస్తున్నారు. అందువల్లే ఒకరకమైన వెలుగు, కాంతితో చంద్రుడు కనిపిస్తున్నాడని, దీనికి కారణం ఎక్సోస్పియర్‌లోని సోడియం అణువులేనని ఇస్రో పేర్కొన్నది.
అయితే ఏంటి?
భూమిపైన ఉన్నటువంటి వాతావరణ వ్యవస్థ చంద్రుడు, బుధుడు వంటి చిన్న గ్రహాలపై లేదు. అక్కడున్నది విభిన్నమైనది. భూ ఉపరితలం నుంచి అంతరిక్షంలో 600 కి.మీ దూరంలోనూ అత్యంత పలుచనైన, బలహీనమైన 'ఎక్సోపియర్' ఉంది. దీంట్లో హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్ వంటి అణువులున్నాయి. ఇది ఒక అంచనా మాత్రమే. ఇక్కడి వాయువుల స్థితి కచ్చితమైన సమాచారం లేదు. సౌర కుటుంబంలో చంద్రుడు, బుధుడు వంటి చిన్న చిన్న గ్రహాల చుట్టూ నిజానికి వాతావరణమనేదే లేదు. కానీ ఎక్సోస్పియర్ ఉందని నాసా కూడా భావిస్తోంది. ఇందులోకి సోడియం ఎలా చేరుతుందన్నది మొదటిసారి చంద్రయాన్-2 ఆర్బిటర్ వెలుగులోకి తీసుకొచ్చింది. వివిధ గ్రహాలు, ఉపగ్రహాల ఎక్సోస్పియర్ ఎలా ఏర్పడుతోందన్నది అంచనా వేయటంలో తాజా పరిశోధన గొప్ప ముందడుగు లాంటిది. ఆ గ్రహాల ఉపరితలంపై ఆ వాయువులు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయన్నది తెలుసుకోవటం సులభతరం కానున్నది.