Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు బలగాల మోహరింపులో హోం మంత్రిత్వశాఖ జాప్యం
- పోలీసుల సహకారంతో విధ్వంసకారుల వీరంగం
- 2020 ఫిబ్రవరి ఢిల్లీ అల్లర్లపై నిజ నిర్థారణ కమిటీ
- ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి.లోకూర్ నేతృత్వం సభ్యులుగా..ఢిల్లీ, మద్రాస్ హైకోర్లు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎ.పి.షా, ఢిల్లీ హైకోర్డు మాజీ న్యాయమూర్తి ఆర్ఎస్ సోది, పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అంజనా ప్రకాష్, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జికె పిళ్లై
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం, హోం మంత్రిత్వ శాఖ బాధ్యతారాహిత్యం, అలసత్వం, ఢిల్లీ పోలీసుల సహకారం, కొన్ని మీడియా సంస్థల, బిజెపి విద్వేష ప్రచారాలే ఢిల్లీలో హింసాకాండ తీవ్రత పెరగడానికి ప్రధాన కారణమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ స్పష్టం చేసింది. 2020 ఫిబ్రవరి 23 నుంచి 26 తేదీల్లో జరిగిన మత ఘర్షణల్లో కేంద్రం లెక్కల ప్రకారం 53 మంది మరణించగా, 200 మంది వరకూ తీవ్ర గాయాల పాలయ్యారు. మృతులు, గాయపడిన వారిలో మూడొంతులకుపైగా ముస్లిములే ఉన్నారు. ఈ ఘోర హింసాకాండ జరుగుతున్నప్పటికీ బాధిత ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించడానికి కేంద్రం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేశాయని కమిటీ విమర్శించింది. అల్లర్లు ప్రారంభమైన 2020 ఫిబ్రవరి 23నే రెండు మతాల మధ్య హింస జరగనుందని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులకు స్పెషల్ బ్రాంచ్, నిఘా విభాగాల నుంచి కనీసం ఆరు అంతర్గత హెచ్చరికలు వచ్చాయని, అదనపు బలగాలను మాత్రం ఫిబ్రవరి 26నే మోహరించారని కమిటీ గుర్తించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రదర్శించిన లోపభూయిష్ట వైఖరి అల్లర్లు మరింతగా పెరగడానికి, మూడు రోజుల పాటు తమ లక్ష్యాలపై మతోన్మాదులు తీవ్రంగా దాడులు చేయడానికి పరోక్షంగా సహాయపడిందని పేర్కొంది. అల్లర్లు ప్రారంభమైన మొదటి మూడు రోజులూ బాధిత ప్రాంతాల నుంచి గరిష్టంగా ఫిర్యాదు కాల్స్ వచ్చినా, బాధిత ప్రాంతాల్లో మోహరించిన ఢిల్లీ పోలీసులు, సెంట్రల్ ఆర్మెడ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది 1,400 మంది కంటే తక్కువే ఉన్నారని, ఫిబ్రవరి 26న మోహరించిన సిబ్బంది సంఖ్య నాలుగు వేలు దాటిందని కమిటీ తెలిపింది. 'వాస్తవానికి సివిల్ పోలీసులు, పారామిలటరీ సిబ్బంది ఫిబ్రవరి 23 కంటే ఫిబ్రవరి 24న ఇంకా తక్కువగా ఉన్నారు. 26నే సిబ్బంది మోహరింపును కనీసస్థాయికి పెంచారు. ఇదే రోజున 'పరిస్థితి అదుపులోనే ఉంది' అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, భద్రతా సలహాదారులు తప్పుడు ప్రకటన చేయడాన్ని కమిటీ తీవ్రంగా తప్పుపట్టింది. ఫిబ్రవరి 24న కేంద్ర హోం సెక్రటరీ అజరు భల్లా పరిస్థితి అదుపులో ఉందని, తగినంత మంది భద్రతా సిబ్బందిని పంపించామని మీడియాకు చెప్పారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 'అలర్లకు కాంగ్రెస్, సిఎఎ ఆందోళకారులు కారణం' అని చెప్పారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీ అల్లర్లకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ రెండు ప్రకటనలనూ కమిటీ విమర్శించింది.
హోం మంత్రిత్వశాఖ, ఢిల్లీ పోలీసులు, మీడియా, బీజేపీ విద్వేష ప్రచారమే కారణం
'కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యొక్క బాధ్యతారహిత ప్రతిస్పందన, ఢిల్లీ పోలీసు అధికారుల ఘోరమైన భాగస్వామ్యం, వైషమ్యాలు పెంచేలా కొన్ని మీడియా సంస్థల కథనాలు, అప్పటికే రెండు నెలల నుంచి సీఏఏకు వ్యతికరంగా నిరసన తెలియజేస్తున్న ముస్లింలపై బీజేపీ విద్వేష ప్రచారం.. ఢిల్లీ అల్లర్లకు సమిష్టిగా కారణమయ్యాయి' అని కమిటీ స్పష్టం చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి.లోకూర్ నేతృత్వం వహించగా, ఢిల్లీ, మద్రాస్ హైకోర్లు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎ.పి.షా, ఢిల్లీ హైకోర్డు మాజీ న్యాయమూర్తి ఆర్ఎస్ సోది, పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అంజనా ప్రకాష్, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జికె పిళ్లై సభ్యులుగా ఉన్నారు.
బీజేపీకి అనుకూలంగా పోలీసుల దాడులు, చార్జిషీట్లు
ముస్లింలపై జరిగిన హింసలో ఢిల్లీ పోలీసులు ఒక భాగంగా ఉన్నారని, అనేక చార్జిషీట్లను పరిశీలిస్తే అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం స్పష్టంగా వెల్లడైందని కమిటీ తెలిపింది. ఈ అల్లర్లపై 758 ఎఫ్ఐఆర్లు దాఖలు కాగా, వీటిలో ఎక్కువ భాగం సీఏఏ నిరసనకారులు, ముస్లింపైనే కేసులు నమోదు చేసినట్టు ఉన్నాయని పేర్కొంది. అల్లర్లు జరగడానికి కొన్ని రోజుల ముందు జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ ప్రాంగణంలోకి ఢిల్లీ పోలీసులు ప్రవేశించి, క్యాంపస్‌ను ధ్వంసం చేసి, విద్యార్థులపై తీవ్రంగా దాడి చేయడాన్ని కమిటీ ఖండించింది. అనేక సార్లు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడంతో 200 మంది వరకూ విద్యార్థులు గాయపడ్డారని తెలిపింది. 'పాకిస్థాన్‌కు వెళ్లిపోండి' వంటి వ్యాఖ్యలు పోలీసులు చేసినట్లు విద్యార్థులు తెలిపారని పేర్కొంది.
ఫిబ్రవరి 24న సిఎఎకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తమ తల్లుల గురించి వెతికేందుకు కర్దంపురిలో నుంచి వచ్చిన ఐదుగురు ముస్లిం యువకులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయడం, వారిలో ఒకరైన ఫైజాన్ మరణించడం గురించి కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాన్ని గుర్తు చేసింది. ఢిల్లీ అల్లర్ల కేసుల విచారణ బీజేపీ, వారి మద్దతుదారులకు అనుకూలంగానే జరుగుతుందనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఈ అల్లర్లపై 700కు పైగా కేసులు నమోదైనా, వీటిలో ఈ ఏడాది జనవరి వరకూ ఆరు కేసుల్లో మాత్రమే చార్జిషీట్లు దాఖలు చేశారని పేర్కొంది. అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించడంలో పోలీసులు తీవ్రమైన జాప్యం చేస్తున్నారని విమర్శించింది. విద్వేషాలను రెచ్చగొట్టిన బీజేపీ నేతలకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించడంలో పోలీసులు విఫలం అవుతున్నారని తెలిపింది. మరోవైపు ఉపా చట్టం కింద అరెస్టయినవారు రెండేళ్ల నుంచి నిర్భంధంలోనే ఉన్నారని గుర్తు చేసింది. జీ న్యూస్, రిపబ్లిక్ టీవీ, ఇండియా టీవీ, ఆజ్ తక్ వంటి ఛానెళ్లలో వచ్చిన కథనాలు అల్లర్ల విస్తరణకు తోడ్పడ్డాయనీ, సీఏఏ వ్యతిరేక నిరసనలను నేరంగా భావించాలనే బీజేపీ ప్రయత్నాలకు అనుకూలంగా ఈ ఛానెళ్లు పనిచేశాయని కమిటీ విమర్శించింది.