Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతంతమాత్రంగా బియ్యం నిల్వలు
- అతివృష్టితో తగ్గనున్న ఉత్పత్తి
- అసాధ్యంగా మారిన సేకరణ లక్ష్యాలు
న్యూఢిల్లీ : చుక్కలను దాటి పరుగులు తీస్తున్న నిత్యావసర వస్తువుల ధరలకు తోడు, ఆహారకొరత కూడా దేశాన్ని చుట్టుముట్టనుందా? తాజా పరిణామాలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశంలో బియ్యం నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి దేశంలో 78.6 మిలియన్ టన్నుల బియ్యం నిల్వలు ఉండగా, ఈ ఏడాది నిల్వలు 44 మిలియన్ టన్నులకు పడిపోయాయి. ఈ సంఖ్యలే చాలు రానున్న రోజుల్లో ఆహార కొరత ఏస్థాయిలో విరుచుకుపడనుందో అర్ధం చేసుకోవడానికి! దీనికి తోడు ఈ ఏడాది ధాన్యం సేకరణ కూడా అంతంతమాత్రంగానే ఉంటుందని, నిర్ధేశించిన లక్ష్యాలు అందుకోవడం దాదాపు అసాధ్యమన్న అంచనాలు వెలువడుతున్నాయి. వీటిని కూడా పరిగణలోకే తీసుకుంటే దేశంలో తిండిగింజలకు సంబంధించి ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టే! అదే జరిగితే సామాన్యుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలోకి పడ్డట్టే! ఈ ఏడాది ప్రారంభంలో గోధుమలకు తీవ్ర కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. అంతకన్నా తీవ్రగానే బియ్యం కొరత రానుందని డౌన్ టు ఎర్త్ తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది.
ఇవీ లెక్కలు...!
కేంద్ర ప్రభుత్వ పౌరసరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటవ తేది నాటికి 49.28 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలు నిల్వ వున్నాయి. వీటిలో బియ్యం 27.95 మిలియన్ టన్నులు కాగా, గోధుమలు 24.82 మిలియన్ టన్నులు. సెప్టెంబర్ 30 వ తేది నాటికి ఆహారధాన్యాల నిల్వ 44.1 మిలియన్ టన్నులకు పడిపోగా, వాటిలో బియ్యం నిలువలు గణనీయంగా తగ్గి, 20.9 మిలియన్ టన్నులకు చేరాయి. గోధుమలు 23. 20 మిలియన్ టన్నులు ఉన్నాయి. ఇదే మాదిరి బియ్యం వినియోగం కొనసాగితే మరో మూడు నెలల్లో పరిస్థితి క్లిష్టంగా మారనుంది.
తగ్గనున్న ఉత్పత్తి ...
మరోవైపు ధాన్యం ఉత్పత్తి ఈ ఏడాది గణనీయంగా తగ్గనుందని అంచనా! గత రబీ సీజన్లో గోధుమల ఉత్పత్తి తగ్గడంతో సేకరణ తగ్గడం, కొరత ఏర్పడటం వంటి అంశాలు తెలిసిందే. అటువంటి పరిస్థితే ఈ ఏడాది ధాన్యం విషయంలో ఏర్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరక్టరేట్ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 6.05 శాతం ధాన్యం ఉత్పత్తి తగ్గుతుందని అంచనా వేసింది. సెప్టెంబర్లో 6.77 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తి తగ్గుతుందని అంచనా వేసింది. ఈ గణాంకాలు విడుదలైన తరువాత కురిసిన భారీ వర్షాలు ఉత్తరభారత దేశంలో కోతకొచ్చిన వరిపంటను ముంచెత్తాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో వరిపంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో ధాన్యం ఉత్పత్తి తగ్గనుంది. సేకరణ లక్ష్యం మరింతగా నీరుగారనుంది.
సేకరణ కష్టమే...!
ఉత్పత్తి తగ్గనున్న నేపథ్యంలో ధాన్యం సేకరణ కూడా కష్టంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పట్లో 44.4 మిలియన్ టన్నుల గోధుమలను సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 18.79 మిలియన్ టన్నులను మాత్రమే సేకరించగలిగింది. అదే పరిస్థితి ఇప్పుడు ధాన్యానికి ఏర్పడుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ ఉంటే కొనుగోలు చేయదు. సెప్టెంబర్లో కురిసిన వర్షాల కారణంగా ధాన్యం సేకరణకు కీలకమైన పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అధికశాతం పంట నీటమునిగింది. మరోవైపు బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు గణనీయంగా పెరగనుండటంతో ప్రైవేటు వ్యాపారులు రంగ ప్రవేశం చేయనున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సేకరణ లక్ష్యం చేరుకోవడం దాదాపు కష్టమని అంచనా! అదే జరిగితే దేశ వ్యాప్తంగా రేషన్ షాపుల్లో బియ్యం తీసుకునే పేద ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.
ఎంత కావాలి..?
అమెరికా వ్యవసాయ మంత్రిత్వశాఖ ఈ ఏడాది జూన్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021-22 సంవత్సరంలో మనదేశంలో 109.50 మిలియన్ టన్నుల బియ్యం వినియోగం జరిగింది. ఈ గణాంకాలను ప్రామాణికంగా తీసుకుంటే కనీసం 4.50 మిలియన్ టన్నుల మేర బియ్యం ఈ ఏడాది వినియోగానికి తగ్గనున్నాయని అంచనా! ఉత్పత్తి, సేకరణ తదితర అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటే మరింత ఎక్కువగానే కొరత ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ఆందోళనలను తోసిపుచ్చుతోంది. అవసరానికి సరిపడా ఆహారధాన్యాల నిల్వలు ఉన్నాయని చెబుతోంది.