Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనస్లు పర్వత శిఖరంపై కాలుమోపిన తెలంగాణ యువతి
- తొలి భారతీయురాలుగా అన్వితా రెడ్డి రికార్డు
- భీకరమైన పరిస్థితుల్ని దాటుకొని పయనం
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 8వ పర్వత శిఖరం 'మౌంట్ మనస్లు'పై తెలంగాణ యువతి పడమటి అన్వితారెడ్డి విజయవంతంగా కాలుమోపింది. పర్వతారోహణలో అనేక మంది ఘటనాఘటన సమర్థులు సైతం 'మనస్లు'ను చేరకోలేకపోయారు. అత్యంత క్లిష్టమైన, సవాల్‌తో కూడిన వాతావరణం అక్కడ నెలకొని ఉంటుంది. ఏ క్షణమైనా మంచుకొండలు విరిగిపడొచ్చు. ఇక వచ్చేశాం.. సాధించేశాం అనుకునే తరుణంలో కొండచరియలు విరిగిపడి అనేకమంది చనిపోయారు. మిగిలినవారు వెనక్కివచ్చారు. తిరిగి ప్రయాణాన్ని కొనసాగించి..అనేక ప్రమాదాల్ని తప్పించుకుంటూ అన్వితారెడ్డి 'మనస్లు'ను అందుకుంది. నేపాల్‌లో 8163 మీటర్ల ఎత్తున్న 'మనస్లు' పర్వత శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా గుర్తింపు సాధించింది. కొద్ది రోజుల క్రితమే 'సుమన్‌లు' పర్వత శిఖరంపైకి చేరుకొని భారతీయ జెండాను ఎగురవేశారు. ఈ పర్వత శిఖరాన్ని చేరుకున్న తొలి భారతీయురాలిగా అన్వితా రెడ్డి రికార్డు సృష్టించారు. అయితే తాజాగా 'మనస్లు' పర్వత శిఖరాన్ని సైతం అధిరోహించి ఆమె వార్తల్లో నిలిచారు. కొద్ది రోజుల క్రితం నేపాల్‌లో మంచుకొండలు విరిగిపడి 10మందికిపైగా పర్వతారోహకులు మరణించారు. దీంతో అక్కడ ఒక భయానక వాతావరణం నెలకొంది. ఎంతోమంది పర్వాతారోహకులు 'మనస్లు' వైపు వెళ్లేందుకు ధైర్యం చేయలేకపోయారు. ఓ వైపు భీకరమైన చలిగాలులు, కఠినమైన దారి. ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అయినప్పటికీ అన్వితారెడ్డి వెనుకడుగు వేయలేదు. మానసికంగా, శారీరకంగా అత్యంత కఠినమైన సవాల్‌ను ఎదుర్కొన్నారు. చివరికి మనస్లు శిఖరంపైకి (సెప్టెంబర్ 29న) చేరుకొని విజయకేతనం ఎగురవేశారు. 24ఏండ్ల అన్వితా భువనగిరి రాక్ క్లైంబింగ్ అకాడమీలో పర్వతారోహణకు సంబంధించి ప్రాథమిక శిక్షణ తీసుకున్నారు. సెప్టెంబర్‌లో నేపాల్‌లో అత్యంత ఎత్తయిన సుమన్‌లు, మనస్లు పర్వతారోహనకు బయల్దేదారు. మనస్లు పర్వతారోహణలో 6200 మీటర్ల ఎత్తులో ఉండగా వారికి సమీపంలో మంచుకొండలు విరిగిపడి ఎంతో మంది ప్రమాదంలో చనిపోయారు. దాంతో అన్వితా, మరికొందరు బేస్ క్యాంప్‌కు చేరుకోవాల్సి వచ్చింది. నాలుగు రోజుల తర్వాత మళ్లీ పైకి వెళ్లటం మొదలుపెట్టారు. క్యాంప్-3కి చేరుకున్నాక..మళ్లీ మంచుకొండలు విరిగిపడ్డాయి. ఇద్దరు పర్వాతారోహకులు చనిపోయారు. ఎంతోమంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు వందమందికిపైగా క్యాంప్-3 వద్దే ఆగిపోయారు. 80మంది వెనక్కిపోగా, ముందుకు వెళ్లాలా లేదా? అన్నదానిపై మిగతావాళ్లు తేల్చుకోలేకపోయారు. అయితే అన్వితా రెడ్డి క్యాంప్-4 దిశగా వెళ్లాలనే నిర్ణయించుకుంది. సహాయకుడిగా ఉన్న షెర్పా కూడా తుది నిర్ణయం ఆమెకే వదిలేశాడు. సెప్టెంబర్ 29 ఉదయం 9.30 గంటలకు మనస్లు పర్వత శిఖరంపైకి ఆమె విజయవంతంగా చేరుకున్నారు.