Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి ఆరోపణలపై సాక్షిగా విచారణ
న్యూఢిల్లీ : రెండు అత్యంత కీలకమైన ఫైల్స్‌పై సంతకాలు చేస్తే..రూ.300కోట్లు ఇస్తామని..తనను ప్రలోభపెట్టారన్న జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక ఆరోపణలపై సీబీఐ విచారణ వేగవంతం చేసింది. అవినీతి కేసులో విచారణ నిమిత్తం కొద్ది రోజుల క్రితం సీబీఐ ఆయన్ని సాక్షిగా ప్రశ్నించిందని సమాచారం. అక్టోబర్ 4న మేఘాలయ గవర్నర్‌గా ఆయన పదవీకాలం ముగిసింది.
దీంతో ఆయన్ని ప్రశ్నించడానికి మార్గం సుగమమైందని సీబీఐ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. రెండు ఫైళ్లపై సంతకాలు చేస్తే రూ.300 కోట్లు ఇవ్వడానికి రిలయన్స్ అంబానీ, ఆర్ఎస్ఎస్ తనకు ఆఫర్ చేశాయని జమ్మూకాశ్మీర్‌కు గవర్నర్‌గా ఉన్నప్పుడు సత్యపాల్ మాలిక్ ఆరోపించారు. వీటికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో సీబీఐ రెండు కేసుల్ని నమోదుచేసింది. ఆయన చేసిన ఆరోపణల్లో ఓ సాక్షిగా సత్యపాల్‌ను కొద్ది రోజుల క్రితం సీబీఐ ప్రశ్నించింది. ప్రయివేటు సంస్థ 'రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ'కి జమ్మూకాశ్మీర్ ఉద్యోగుల ఆరోగ్య బీమా రక్షణ పథకం కాంట్రాక్ట్ ఇవ్వాలని తనపై ఒత్తిడి వచ్చిందని, ఫైల్‌పై సంతకం చేస్తే భారీ మొత్తం ఇస్తామంటూ తనను ప్రలోభపెట్టారని సత్యపాల్ మాలిక్ ఆరోపించారు. దీనిని మొదటి కేసుగా సీబీఐ విచారిస్తోంది. ఇక రెండో కేసు..రూ.2200 కోట్ల విలువజేసే కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయన్నది. తొలుత ఈ ప్రాజెక్ట్ పనులు పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌కు దక్కాయి. అయితే ఆ కంపెనీకి ఈ ప్రాజెక్టును కేటాయించడానికి ముందు ఆన్లైన్ టెండర్ ప్రక్రియ చేపట్టలేదని ఆరోపణలు వెలువడ్డాయి. దీనిని రెండో కేసుగా సీబీఐ విచారిస్తోంది.