Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాడులు చేయాలంటూ ఢిల్లీలో బీజేపీ, వీహెచ్‌పీ నేతల పిలుపు
- వారిని ఆర్థికంగా బారుకాట్ చేయాలని వీహెచ్‌పీ ర్యాలీలో ప్రసంగాలు..
- పత్రికల్లో వార్తలు..సోషల్ మీడియాలో వీడియోలు..
- అయినా కేసులు నమోదుచేయని ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ : ముస్లింలను టార్గెట్ చేస్తూ దేశ రాజధాని నడిబొడ్డున వీహెచ్‌పీ, బీజేపీ నాయకులు మరోసారి విద్వేషాన్ని వెళ్లగక్కారు. దేశ రాజధాని నడిబొడ్డున ఆదివారం వీహెచ్‌పీ నేతృత్వంలో సాగిన ర్యాలీలో బీజేపీ నేతలు ప్రసంగిస్తూ, ముస్లింలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలంటూ హిందువుల్ని రెచ్చగొట్టారు. విద్వేష ప్రసంగాలు చేసిన నేతల్లో పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్ సింగ్ వర్మ, లోని ఎమ్మెల్యే నంద కిషోర్ గుజ్జర్ ఉన్నారు. మరికొంత మంది వీహెచ్‌పీ నాయకులు, బీజేపీ స్థానిక నేతలు ఇష్టమున్నట్టుగా మాట్లాడారు. ముస్లింలపై దాడులకు తెగబడాలనీ, వారిని బారుకాట్ చేయాలని వ్యాఖ్యానించారు. వీహెచ్‌పీకి చెందిన 'విరాట్ హిందు సభ' నేతృత్వంలో ఈ ర్యాలీ చేపట్టారు. మరికొన్ని హిందూత్వ గ్రూపులు కూడా ఇందులో భాగస్వామ్యమయ్యాయి. 2020 నాటి ఢిల్లీ అల్లర్లకు ముందు ఇలాగే ఎంపీ వర్మ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ఈ మొత్తం ఉదంతం వార్తా కథనాలుగా వివిధ పత్రికల్లో వచ్చినా ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టడం లేదు. ఎవరిపైనా ఎలాంటి కేసులు నమోదుచేయలేదు.
వారి దుకాణాలకు వెళ్లొద్దు : బీజేపీ ఎంపీ వర్మ
మొత్తం ముస్లింలందర్నీ బారుకాట్ చేయాలంటూ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ రెచ్చగొట్టారు. ముస్లింలు అనే పదాన్ని వాడకుండా, వారిని టార్గెట్ చేస్తూ ప్రసంగించారు. ''బారుకాట్ చేస్తారా? లేదా? నాకు వాగ్దానం చేయండి'' అక్కడి వచ్చిన వారితో వాగ్దానం చేయించారు. ''మీకు వారిని (ముస్లిం) చూసినప్పుడు..మీ మనసుల్లో ఒకటి రావాలి. పూర్తిగా బారుకాట్ చేయటమొక్కటే పరిష్కారమనేది తెలుసుకోవాలి. నాతో అంగీకరిస్తారా? లేదా? అవుననే వాళ్లు చేతులెత్తాలి. నేను చెప్పినట్టు చేయండి..వారిని(ముస్లింల) పూర్తిగా బారుకాట్ చేస్తున్నాం. వారు అమ్మే వస్తువులేవీ కొనొద్దు. వారి దుకాణాలకు వెళ్లొద్దు'' అంటూ వర్మ చేసిన ప్రసంగం ఢిల్లీలో తీవ్ర ఉద్రక్తతను రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. తన ప్రసంగాన్ని, మాటల్ని ఎంపీ వర్మ సమర్ధించుకున్నారు. ఏ వర్గాన్నీ ఉద్దేశించి మాట్లాడలేదని , హింసాకాండకు పాల్పడ్డ కుటుంబాల్ని మాత్రమే బారుకాట్ చేయాలని పిలుపునిచ్చానని చెప్పారు. రెస్టారెంట్స్, ఇతర వ్యాపారాల్లో ఉన్న ఆ కుటుంబాలను బారుకాట్ చేయాలని అన్నారు.
వీహెచ్‌పీకి చెందిన జగత్గురు యోగేశ్వర్ ఆచార్య వారిని ఉద్దేశించి హిందువుల్ని రెచ్చగొట్టారు. ''మన మందిరాల వైపు చూస్తే వారి కాళ్లు, చేతులు నరకండి. గొంతుల్ని కోయండి. ఏం జరుగుతుంది? ఒకరిద్దరికి ఉరిశిక్ష పడుతుంది. అంతేగా. అందరం రంగంలోకి దిగి హత్యాకాండకు తెగబడాలి'' అంటూ విషం వెళ్లగక్కారు. ఆయన వ్యాఖ్యలపై మీడియా సంప్రదిస్తే, ''ఆ మాటలు పదే పదే చెబుతాను. హిందూ మత రక్షణ కోసం నేను చంపడానికి, చావడానికి సిద్ధం'' అని చెప్పారు. మరో వీహెచ్‌పీ నాయకుడు మాట్లాడుతూ హిందువులు తుపాకాలు పట్టుకోవాలని చెప్పారు. 'గన్స్ కొనండి. లైసెన్స్ తీసుకోండి. రాకపోయినా ఫర్వాలేదు'' అని అన్నారు.
పర్వేష్ వర్మను తక్షణమే అరెస్టు చేయాలి : సీపీఐ(ఎం) డిమాండ్
ముస్లిములను పూర్తిగా బహిష్కరించాల్సిందిగా పశ్చిమ ఢిల్లీ బీజేపీ ఎంపి పర్వేష్ వర్మ పిలుపివ్వడాన్ని సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆదివారం విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ వర్మ పై వ్యాఖ్యలు చేశారు. ముస్లిముల నుంచి ఏమీ కొనవద్దని, వారికి వేతనాలు చెల్లించవద్దంటూ బహిరంగంగానే కార్యక్రమానికి వచ్చిన వారిని కోరారు. పైగా అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు విహెచ్పి జాయింట్ కార్యదర్శి సురేంద్ర జైన్ మాట్లాడుతూ, ఢిల్లీని మినీ పాకిస్తాన్‌గా మార్చాలని ముస్లిములు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఈ ప్రకటనలు చూస్తుంటే, ముస్లిములకు వ్యతిరేకంగా శతృత్వాన్ని పెంపొందించేందుకు, మత విద్వేషాన్ని రగిల్చేందుకు చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని సీపీఐ(ఎం) విమర్శించింది. ఢిల్లీలోని మత సామర్యతను దెబ్బతీసేలా ఇటువంటి అభ్యంతరకరమైన ప్రసంగాలు చేయడం పర్వేష్ వర్మకు ఇదే మొదటిసారి కాదు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కపిల్ మిశ్రాతో కలిసి వర్మ చేసిన ప్రసంగం ఈశాన్య ఢిల్లీలో మత హింసకు దారి తీసింది. 54మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుండే ఢిల్లీ పోలీసులు వారిపై ఎటువంటి చర్య తీసుకోవడానికి ఆనాడు తిరస్కరించారు. పైన పేర్కొన్న కార్యక్రమంలో అభ్యంతరకరరీతిలో ప్రసంగాలు చేసిన పర్వేష్ వర్మ, సురేంద్ర జైన్ తదితరులను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ముస్లిం కమ్యూనిటీపై విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నందుకు, మత సామరస్యతను, ప్రశాంతతను భగం చేస్తున్నందుకు వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.