Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్లక్ష్యం పేరిట నిలిపివేత
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్
న్యూఢిల్లీ : ఉద్యోగ విరమణ అనంతరం భద్రమైన జీవితాన్ని గడపటానికి ఉద్ధేశించిన పెన్షన్ చెల్లింపులను ప్రభుత్వాలు భారంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ఈ భారాన్ని సాధ్యమైనంత మేర తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తాజాగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగులకు పెన్షన్ నిలిపివేస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నెల 7వ తేది నుండే అమలులోకి వచ్చిన ఈ ఉత్తర్వులు సోమవారం వెలుగులోకి వచ్చాయి. నిర్లక్ష్యంగా ఉంటే పెన్షన్‌ను నిలిపివేస్తామని పేర్కొన్న ప్రభుత్వం నిర్లక్ష్యమని తేల్చడానికి కొలబద్దలేంటో స్పష్టం చేయలేదు. ఈ ఉత్తర్వుల ప్రకారం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగుల పెన్షన్‌ను నిలుపు చేసే లేదా రద్దు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వ కార్యదర్శికి వుంటాయి. ఈ మేరకు కేంద్ర సివిల్ సర్వీసెస్ (పెన్షన్) నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
2003 డిసెంబరు 31కి ముందుగా సర్వీస్‌లో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు (రైల్వే కాంట్రాక్టు ఉద్యోగులు మినహా) ఈ సవరించిన నిబంధనలు వర్తిస్తాయి. సదరు ఉద్యోగి పెన్షన్ లేదా గ్రాట్యుటీ లలో ఒకదానిని కానీ, లేదా రెంటిని కానీ పూర్తిగా లేదా పాక్షికంగా నిలుపుదల చేయడానికి ఈ సవరణలు అవకాశం కల్పించాయి. శాశ్వతకాలానికి నిలుపుదల చేయవచ్చని, లేదా నిర్ధిష్ట కాలపరిమితికి కూడా ఈ నిర్ణయాన్ని వర్తింపచేయవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని బట్టి పెన్షన్ లేదా గ్రాట్యుటీ నుంచి రికవరీ చేయాలని ఆదేశాలు జారీ చేయవచ్చు. అయితే తుది ఆదేశాలు జారీ చేయడానికి ముందుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను సంప్రదించాల్సి వుంటుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. సదరు ఉద్యోగిపై శాఖాపరమైన విచారణ లేదా దర్యాప్తు కార్యకలాపాలు చేపట్టిన పక్షంలో ఆ శాఖాధికారులు అందుకు సంబంధించిన నివేదికను, నిర్ధారణలను సంబంధిత అధికారులకు అందచేయాలని పేర్కొన్నారు.