Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతోన్మాదాన్ని తిప్పికొట్టిన ఛాంపియన్
- సంతాప సభలో నేతలు
న్యూఢిల్లీ: సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు కొడియేరి బాలకృష్ణన్ ఉద్యమ మార్గదర్శి అనీ, మతోన్మాదాన్ని తిప్పికొట్టిన ఛాంపియన్ అని సీపీఐ(ఎం) నేతలు కొనియాడారు. ఇటీవలి మరణించిన కొడియేరి బాలకృష్ణన్ సంతాప సభ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఏకేజీ భవన్)లో జరిగింది. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ కొడియేరితో గడిపిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఆచరించడంలో ఎన్నడూ రాజీపడలేదని, మతోన్మాదంపై నిరంతరం పోరు సాగించారని కొనియాడారు. ఆయన ప్రజా నేతగా నిరంతరం ప్రజల గుండెల్లో నిలుస్తారని అన్నారు. ఆయన పనిలో, మాటల్లో వర్గ ధృక్పదం స్పష్టం అవుతోందని పేర్కొన్నారు. పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ మాట్లాడుతూ పార్టీ తీర్మానం చేస్తే, దాన్ని అమలు చేసి తీరాల్సిందేననే పట్టుదలతో కొడియేరి పని చేశారని అన్నారు. పొలిట్ బ్యూరో సభ్యులు తపన్ సేన్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే వామపక్ష రాజకీయాల్లో పని చేశారని, నిరంతరం పేద ప్రజల పక్షాన నిలిచారని తెలిపారు. కమ్యూనిస్టు నేతగా ఆయన చిరకాలం నిలిచారని పేర్కొన్నారు.
ప్రకాశ్ కరత్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ నాటి నుంచే కొడియేరి తమకు తెలుసనీ, అప్పుడు ఎస్ఎఫ్ఐకి మార్గదర్శిగా ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య... కొడియేరిని ఉద్దేశించి ప్రసంగాలతో జనాకర్షక నేతగా ఎదుగుతారని తెలిపినట్టు ప్రకాశ్ కరత్ గుర్తు చేశారు. కన్నూర్‌లో మత హింస జరిగినప్పుడు ఆపడానికి కొడియేరి, పినరయి వంటి కమ్యూనిస్టులు లేకపోతే, ఆగేది కాదని కమిషన్ రిపోర్టులో కూడా ఉందని గుర్తు చేశారు. ఆయన మత హింస, మతోన్మాదంపై అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. అంతకు ముందు కొడియేరి చిత్రపటానికి పూలమాలలేసి నివాళుర్పించారు. సభకు హాజరైన వారు పుష్పాంజలి ఘటించారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జోగేంద్ర శర్మ, బి.వెంకట్, సిపిఎం ఏపి నేత మిరియం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.