Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ లాంఛనాలతో ములాయం అంత్యక్రియలు
- అభిమాన నేతను కడసారి చూసేందుకు తరలి వచ్చిన ప్రజలు
- హాజరైన వివిధ పార్టీల నేతలు
న్యూఢిల్లీ : సీనియర్ రాజకీయ నేత ములాయం సింగ్ యాదవ్‌కు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న ములాయం సింగ్ యాదవ్ అంతిమయాత్రలో దాదాపు లక్షన్నర మందికిపైగా ప్రజానీకం పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. హర్యానా గురుగ్రామ్‌లోని మేదంతా ఆస్పత్రిలో మరణించిన ములాయం సింగ్ యాదవ్(82) భౌతికకాయాన్ని తన స్వగ్రామం సైఫారుకు సోమవారం తరలించారు. ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ములాయం ఇంటికి కిలో మీటరు దూరంలోని మేళా మైదానంలో మంగళవారం ఉంచారు. ములాయం భౌతికకాయంపై జాతీయ జెండాను కప్పారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు సోమవారం రాత్రి నుంచే వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. వివిధ పార్టీల నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ములాయం సింగ్ యాదవ్‌ను చివరిసారి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నుంచి అంతిమయాత్ర కొనసాగింది. పూలదండలతో అలంకరించిన అంతిమయాత్ర ట్రక్కులో కుమారుడు అఖిలేశ్ యాదవ్, ములాయం సోదరుడు శివపాల్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. సైఫారు గ్రౌండ్ సమీపంలోని కుటుంబీకుల భూమిలో మధ్యాహ్నం 3 గంటలకు దహన సంస్కారాలు జరిగాయి. చితికి ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ నిప్పు అంటించారు.
ములాయం సింగ్ యాదవ్‌కు నివాళుర్పించిన వారిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు భూపేష్ భాఘేల్, అశోక్ గెహ్లాట్, కె.చంద్రశేఖర్, జైరాం ఠాకూర్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ఎన్.చంద్రబాబు నాయుడు, కమల్‌నాథ్, ఎన్సీపీ అధినేత శరద్ పవర్, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఎన్సీపీ నేతలు సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్, యూపీ కాంగ్రెస్ సీనియర్ నేత ప్రమోద్ తివారీ, ఆర్ఎల్డి అధ్యక్షుడు జయంత్ చౌదరి, ఆప్ నేత సంజరు సింగ్, డీఎంకే నేత టిఆర్ బాలు, ఉదయనిధి, ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్, మంత్రులు జితిన్ ప్రసాద్, అసిమ్ అరుణ్, ఎంపిలు రీటా బహుగుణ జోషి, దేవేంద్ర సింగ్ భోలే, వ్యాపార వేత్త అనిల్ అంబానీ, యోగా గురువు బాబా రామ్‌దేవ్, నటుడు అభిషేక్ బచ్చన్, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్, రైతు నేతలు రాకేష్ టికాయిత్, నరేష్ టికాయిత్ తదితరులు ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ మరణానికి నేపాల్, టిబెట్ దేశాధినేతలు సంతాపం ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి..
తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావుతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కవిత, సంతోష్‌కుమార్ నివాళులర్పించారు. ఏపీ నుంచి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్రావు తదితరులు నివాళులర్పించినవారిలో ఉన్నారు.