Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిఫారసు చేసిన ప్రస్తుత సీజేఐ జస్టిస్ యుయు లలిత్
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ నియామకం కానున్నారు. ఈ మేరకు జస్టిస్ చంద్రచూడ్ పేరును సిఫారసు చేస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్ యుయు లలిత్ కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం లేఖ రాశారు. ఈ లేఖను అందచేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ ఉదయం 10.15 గంటలకు న్యాయమూర్తుల లాంజ్‌లో సమావేశమయ్యారు. తదుపరి సీజేఐ పేరును సిఫారసు చేయాల్సిందిగా కోరుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్‌ను కోరుతూ ఈ నెల 7న సీజేఐ సెక్రటేరియట్‌కు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు నుంచి ఒక లేఖ వచ్చింది. రెండున్నర నెలల పాటు సీజేఐగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. నవంబర్ 9న 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీజేఐగా చంద్రచూడ్ రెండేండ్ల (2024 నవంబర్ 10) పాటు సుదీర్ఘంగా కొనసాగనున్నారు.
జీవిత నేపథ్యం
చంద్రచూడ్ తండ్రి దేశ చరిత్రలోనే ఎక్కువ కాలం సుప్రీంకోర్టు సీజేఐగా పని చేశారు. 1979లో సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ (ఢిల్లీ)లో ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్‌లో ఆయన ఆనర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. 1982లో ఢిల్లీ యూనివర్సిటీలోని లా సెంటర్ క్యాంపస్‌లో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. జూనియర్ న్యాయవాదిగా చంద్రచూడ్ కొంత కాలం పని చేశారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పాలీ నారిమన్‌కు సంబంధించిన కొన్నింటిని డ్రాఫ్టింగ్ చేశారు. 1983లో హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్ఎల్ఎం డిగ్రీని పొందారు. 1986లో హార్వర్డ్‌లో ఆయన డాక్టరేట్ ఆఫ్ జురిడికల్ సైన్స్ (ఎస్జేడీ) పూర్తి చేశారు. మొదట సుల్లివన్ అండ్ క్రోమ్‌వెల్ అనే న్యాయ సంస్థలో చంద్రచూడ్ పని చేశారు. ఆ తరువాత ముంబాయి హైకోర్టులో, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1998 జూన్‌లో ముంబాయి హైకోర్టు సీనియర్ న్యాయవాది అయ్యారు. అదే ఏడాదిలో అడిషనల్ సొలిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. న్యాయమూర్తిగా నియామకం అయ్యే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. 2000 మార్చి 29న ముంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ సమయంలోనే మహారాష్ట్ర జ్యూడీషియల్ అకాడమీకి డైరెక్టర్‌గా పని చేశారు. 2013 అక్టోబర్ 31న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియ మితులయ్యారు. 2021 ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు కొలీజియం సభ్యులయ్యారు.