Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర్మాధికారి కమిటీ ఆదేశాలు అమలు చేయడానికి రెండు వారాల గడువు
- తెలంగాణ విద్యుత్తు సంస్థలు ఉద్దేశపూర్వంగా ఉల్లంఘించాయి : తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కోర్టు తీర్పు
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి తెలంగాణ విద్యుత్తు సంస్థలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఆదేశాలు అమలు చేయడానికి చివరి అవకాశంగా రెండు వారాల గడువు ఇస్తున్నట్టు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినందుకు శిక్షా కాలాన్ని ప్రకటించే ముందు చివరి అవకాశం ఇస్తున్నట్టు తెలిపింది. తెలుగు రాష్ట్రాల విద్యుత్తు ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు తీర్పును తెలంగాణ విద్యుత్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించాయనీ, దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని తాము శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్నామని పేర్కొంది. తెలంగాణ విద్యుత్తు సంస్థలు ఏ మేరకు ఆదేశాలు అమలు చేశాయో సమీక్షించడానికి తదుపరి విచారణ అక్టోబరు 31న చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల విద్యుత్తు ఉద్యోగుల విభజనకు సంబంధించి సుప్రీంకోర్టు జస్టిస్ ధర్మాధికారి కమిటీ నియమించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 655 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్తు సంస్థలకు కేటాయిస్తూ కమిటీ నిర్ణయించింది. అదేవిధంగా ఏపీకి కూడా తెలంగాణ నుంచి 655 మంది ఉద్యోగులను పంపాలని సిఫార్సు చేసింది. కమిటీ సిఫార్సు చేసిన వారిలో 571 మందికే తెలంగాణ విద్యుత్తు సంస్థలు పోస్టింగ్ ఇవ్వగా 84 మందిని ఏపీ నుంచి అదనంగా పంపారని తెలిపింది. తెలంగాణ విద్యుత్తు సంస్థలు సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా ధిక్కరణకు పాల్పడ్డాయంటూ 84 మంది ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారించి మంగళవారం 54 పేజీల తుది తీర్పు వెలువరించింది. ''84 మంది పిటిషనర్లలో, 28 మంది టీఎస్జెన్కో, 35 మంది టీఎస్ట్రాన్స్కో, 21 మంది టీఎస్ డిస్కమ్స్లో విలీనం చేయాల్సి ఉంది. వీరిని ఏపీ విద్యుత్తు సంస్థలు రిలీవ్ చేయడంతో పాత సంస్థతో ఆయా ఉద్యోగులకు ఎలాంటి సంబంధాలు లేవు. జస్టిస్ ధర్మాధికారి కమిటీ తుది నివేదిక సుప్రీంకోర్టు ఆమోదించిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలు దానికి బాధ్యత వహించాల్సిందే. ఉద్దేశపూర్వకంగా తప్పించుకోవాలని చూస్తే కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినట్లే'' అని పేర్కొంది. ''కోర్టు ఆదేశాలు పట్ల తెలంగాణ విద్యుత్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా అవిధేయత చూపినట్టు పరిగణిస్తున్నాం. వాటిని దోషులుగానూ పరిగణిస్తాం. తగిన శిక్షకు కూడా గురవుతారు. ఏపి నుంచి రిలీవ్ అయిన 84 మంది ఉద్యోగులు నాటి నుంచి ఎలాంటి జీతం తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలు అమలు చేయడానికి తెలంగాణ విద్యుత్తు సంస్థలకు ఒక చివరి అవకాశం ఇస్తున్నాం. ఏపి నుంచి రిలీవ్ అయిన 84 మంది ఉద్యోగులకు రిలీవ్అయిన రోజు నుంచి వేతనాలు, ఇతర సేవా ప్రయోజనాలు చెల్లించడానికి రెండు వారాలు గడువు ఇస్తున్నాం. ఆదేశాలు అమలు పర్యవేక్షించడానికి తదుపరి విచారణ అక్టోబరు 31కు వాయిదా వేస్తున్నాం'' అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.