Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి : రాష్ట్ర బీసీ కమిషన్‌కు సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ :ముదిరాజ్ వర్గాన్ని బీసీ (ఏ)లో చేర్చొచ్చా అనే అంశంపై విచారణ జరిపి తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర బీసీ కమిషన్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. ముదిరాజ్‌లను బీసీ(డీ) నుంచి బీసీ(ఏ)కు మార్చుతూ 2009లో ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోను ఉమ్మడి హైకోర్టు కొట్టివేయగా ఏపీ ముదిరాజ్ మహాసభ సుప్రీంకోర్టును 2010లో ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌ను మంగళవారం సీజేఐ జస్టిస్ యు.యు లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించింది. తమ వాదనలు వినాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు జీఎన్.రెడ్డి, కేసరి మహేందర్‌లు ధర్మాసనాన్ని కోరారు. ముదిరాజ్‌లను బీసీ (ఏ)లో చేర్చొర్చా లేదా అనే అంశంపై విచారణ చేయాలని తెలంగాణ బీసీ కమిషన్‌ను ఆదేశించింది. పిటిషనర్ల వాదనలు విని నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని పేర్కొంది. న్యాయం జరగలేదని భావిస్తే పిటిషనర్లు తిరిగి కోర్టును ఆశ్రయించొచ్చని పేర్కొన్న ధర్మాసనం విచారణ ముగిస్తున్నట్లు తెలిపింది.
బీసీ జాబితా నుంచి ఆ తూర్పు కాపు, కళింగ కులాల తొలగింపుపై నివేదిక ఇవ్వండి
బీసీ జాబితా నుంచి తూర్పు కాపు, కళింగ తదితర కులాలను తొలగించిన అంశంపై మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ బీసీ కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్పు రామనర్సు, పెచ్చేటి శ్రావణి తదితరులతోపాటు పలు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. బీసీ కమిషన్ మూడు నెలల్లో నివేదిక అందజేయనుందని తెలంగాణ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది వైద్యనాధన్, న్యాయవాది పాల్వాయి వెంకట్‌రెడ్డిలు ధర్మాసనానికి వివరించారు. బీసీ కమిషన్ చైర్మెన్ ఎవరు అని ప్రశ్నించిన ధర్మాసనం మూదు నెలల్లో నివేదిక అందజేయాలని ధర్మాసనం ఆదేశించి విచారణ వాయిదా వేసింది.