Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : విద్వేష ప్రసంగాలు, చర్చలను తక్షణమే అరికట్టాల్సిన అవసరం వుందని సుప్రీం కోర్టు సోమవారం అభిప్రాయపడింది. దేశంలో మైనారిటీలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని రెచ్చగొడు తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, ఈ పరిస్థితుల వల్ల మొత్తంగా వాతావరణం కలుషితమై పోతోందని, అందువల్ల దీన్ని అరికట్టాలనడం సరైందేనని పేర్కొంది. గతేడాది ఉత్తరాఖండ్‌లోనూ, దేశ రాజధానిలోనూ జరిగిన ధర్మ సంసద్ల్లో విద్వేష ప్రసంగాలు చేసిన వారిపై పోలీసులు ఏ చర్యలు తీసుకున్నారో తెలియచేయాలంటూ మరో కేసులో ఉత్తరాఖండ్, ఢిల్లీ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు కోరింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో విహెచ్పి, ఇతర నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశాయని ఢిల్లీ పోలీసులు ప్రకటించిన రోజునే కోర్టు వ్యాఖ్యలు, ఆదేశాలు వెలువడ్డాయి. విద్వేష ప్రసంగాలు జరిగిన సంఘటనల వివరాలు, వాటిపై దర్యాప్తు సందర్భంగా తీసుకున్న చర్యల వివరాలు ఇవ్వాల్సిందిగా పిటిషనర్ హెచ్ మన్సుఖానిని ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్, జస్టిస్ ఎస్ఆర్ భట్‌లతో కూడిన బెంచ్ కోరింది. ఈ రోజుల్లో విద్వేష ప్రసంగాలనేవి లాభదాయకమైన వ్యాపారంగా మారాయని పిటిషనర్ వ్యాఖ్యానించారు.ఈ విద్వేష ప్రసంగాల ఫలితంగా దేశవ్యాప్తంగా వాతావరణం కలుషితమై పోతోందని, అందువల్ల వీటిని అరికట్టాల్సిన అవసరం వుందనడం సమర్ధనీయమేనని బెంచ్ వ్యాఖ్యానించింది. అయితే కోర్టు ఏదైనా ఒక విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటే, దానికి తప్పనిసరిగా వాస్తవిక నేపథ్యం వుండాలని బెంచ్ పేర్కొంది. అందువల్ల విద్వేష ప్రసంగాలు చేసిన సందర్బాలు ఒకటి రెండింటిని ఉదహరించడంపై పిటిషనర్ దృష్టి కేంద్రీకరించాలని కోరింది. అన్ని వివరాలను పొందుపరుస్తూ అదనపు అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా పిటిషనర్‌ని బెంచ్ కోరింది.