Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలి :
అన్ని హైకోర్టులకు సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : ఐదేండ్ల కంటే ఎక్కువ కాలం పాటు పెండింగ్లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. పెండింగ్ కేసుల సంఖ్యతో పాటు ట్రయిల్స్ను త్వరితగతిన ముగించేందుకు తీసుకున్న చర్యలకు సంబంధించిన అఫిడవిట్లను నాలుగు వారాల్లో దాఖలు చేయాలని దేశంలోని అన్ని హైకోర్టులను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఐదేండ్ల కు పైబడి పెండింగ్లో ఉన్న అన్ని కేసులలో సంబంధింత హైకోర్టుల నుంచి నివేదికను కోరాలని అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది విజరు హన్సారియా అభ్యర్థన మేరకు సుప్రీం కోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారించింది. 768 మంది పార్లమెంట్ సభ్యుల్లో దాదాపు 400 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని హన్సారియా ధర్మాసనానికి తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8కి ఈ రిట్ పిటిషన్ సవాలుగా ఉందని, నిర్దిష్ట నేరాలకు శిక్ష అనుభవించిన వ్యక్తులను కొన్ని సంవత్సరాల పాటు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించవచ్చని తెలిపారు. బిల్కిస్ బానో కేసులో లాగా, జీవిత ఖైదు పడిన నిందితులు ఇప్పుడు బయట ఉన్నారని, సెక్షన్ 8లో పేర్కొన్న సమయం తరువాత వారు శాసన సభ్యులు కాగలరని పేర్కొన్నారు. అమికస్ క్యూరీ ఆందోళనను వివరంగా వినాలని ధర్మాసనం నిర్ణయించింది. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తరువాత సుప్రీం కోర్టు ఈ క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారాన్ని పర్యవేక్షిస్తోంది.