Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం అందరికీ సమాన వైద్య సౌకర్యం అందించేందుకు పలు ఆరోగ్య పథకాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా రోజువారీ ఆహారపు అలవాట్ల ద్వారా వచ్చే వ్యాధులు రాష్ట్రానికి పెనుముప్పుగా పరిణమించాయనీ... అలాంటి వ్యాధులను నియంత్రించేందుకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 'హెల్దీ వాక్‌వేస్'ను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. అలాగే పుట్టుకతోనే గుండె జబ్బులు (సీహెచ్‌డీ) ఉన్న చిన్నారులకు మెరుగైన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందించేందుకు ఫాలో అప్ ప్రోగ్రామ్‌లు అందించనున్నట్టు పేర్కొంది. శిశు మరణాల రేటు (ఐఎంఆర్)ను మరింత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హదయం మిషన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. గిరిజనులు అధికంగా ఉండే పాలక్కడ్ జిల్లా అట్టపాడిలో ఆయుష్ ఆస్పత్రుల ద్వారా సేవలను అందించనున్నట్టు తెలిపింది. ఆయుష్ రంగం ద్వారా వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం పలు చర్యలను ప్రారంభించింది. డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు, పక్షవాతం అధికంగా ఉన్నాయి. అలాంటి వారిని గుర్తించి చికిత్స అందించేందుకు ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఇంటింటి సర్వే ప్రారంభించింది. 30 ఏండ్లు పైబడిన వారిలో ఈ వ్యాధులను గుర్తించేందుకు ఆశా కార్యకర్తల ద్వారా డేటాను సేకరించి, స్టైల్ ఆండ్రాయిడ్‌లో అప్డేట్ చేస్తున్నారు. మొత్తం 140 నియోజకవర్గాల్లో పార్కులు వంటి వాటిని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇలాంటి వ్యాధులను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామనీ, ఉచితంగా చికిత్స అందిస్తామని ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. పార్కులు, ఓపెన్ జిమ్‌లతో పాటు ప్రజలకు వ్యాయామం, ఆటలు ఆడేందుకు స్థలాలను ఏర్పాటు చేయనున్నారు. వాటి కోసం స్థానిక అధికారులు, క్రీడాశాఖ స్థలాలను గుర్తించి పర్యవేక్షిస్తుందని అన్నారు.
ఆయుష్ ద్వారా విస్తతంగా వైద్య సేవలు
రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్ సౌకర్యాలను మెరుగుపరచడానికి రూ.97.77 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గతేడాదితో పోలిస్తే కేటాయింపులు మూడు రెట్లు పెరిగాయని జార్జ్ మీడియాకు చెప్పారు. అట్టపాడి గిరిజనుల కోసం రూ.15 కోట్లతో 50 పడకల ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆస్పత్రిని ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. రెండు ఆయుర్వేద, హౌమియోపతి వైద్య కళాశాలలను పేషెంట్ ఫ్రెండ్లీ ఆస్పత్రులుగా మార్చేందుకు రూ.5.25 కోట్లు కేటాయించారు. ఐదు జిల్లాల్లో తక్కువ ధరకే పరీక్షలు చేసేందుకు ఆయుష్ ల్యాబరేటరీలు ఉంటాయి. చిన్నారుల్లో రక్తహీనత నివారణకు అరుణిమ కార్యక్రమం కింద ఐసీడీఎస్ కేంద్రాల ద్వారా ఆయుర్వేద మందులు పంపిణీ చేయనున్నారు.