Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎల్సీ సమావేశం నిర్వహించాలి :
కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్యాదవ్తో కార్మిక సంఘాలు
న్యూఢిల్లీ : కార్మిక హక్కులను కాలరాస్తున్న లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (ఐఎల్సీ)ను తక్షణమే నిర్వహించాలని కోరాయి. కార్మిక సంఘాల నేతలతో కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వేర్వేరుగా చర్చలు జరిపారు. లేబర్ కోడ్స్‌ను ఎందుకు వ్యతిరేకిస్తోన్నారో తెలపాలని ఆయా సంఘాల నేతలను కోరారు. దీనికి కార్మిక సంఘాల నేతలు లేఖల ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు. అన్ని సంఘాలూ లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. తక్షణమే ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటుచేయాలని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘం భారతీయ మజ్దూర్ సంఫ్‌ుతో సహా కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేశాయి. అలాగే అన్ని కార్మిక సంఘాలతో ఉమ్మడి సమావేశం ఏర్పాటుచేయాలని కోరాయి. అయితే లేబర్ కోడ్స్‌పై ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలం అయ్యాయి.
సామాజిక భద్రతపై కోడ్, వేతనాలపై నియమావళికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు అనుబంధ కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఫ్‌ు (బీఎంఎస్) మద్దతు ఇచ్చినప్పటికీ పారిశ్రామిక సంబంధాల కోడ్, వత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌ను వ్యతిరేకించింది. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్‌ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల కార్మిక సంఘాలతో పాటు బీఎంఎస్ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ పంపింది.
సెప్టెంబర్ చివరి నాటికి అన్ని కేంద్ర కార్మిక సంఘాల(సీటీయు)లతో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తన ప్రత్యేక చర్చలను పూర్తిచేశారు. కంపెనీ యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ సంఘాలతో కూడా చర్చలు జరిపారు. రానున్న రోజుల్లో మరికొన్ని యజమానుల సంఘాలతో మంత్రి సమావేశం కానున్నట్టు మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. మంత్రితో జరిగిన చర్చల్లో సీఐటీయూ తరపున జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. హేమలత, తపన్‌సేన్, జాతీయ కార్యదర్శి కరుమలయన్ తదితరులు పాల్గొన్నారు.
10 కేంద్ర కార్మిక సంఘాల నాయకులు సమావేశమై పరిణామాలను సమీక్షించారు. కోడ్లపై తమ అభ్యంతరాలకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సమాధానం ఇవ్వలేదని కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ ప్రభుత్వంలో ఐఎల్సీ సమర్థవంతమైన త్రైపాక్షిక యంత్రాంగంగా పనిచేయడం లేదనీ, కార్మికుల సమస్యలపై చర్చించేందుకు ఐఎల్సీని తక్షణమే ఏర్పాటు చేయాలని సీఐటీయూ అధ్యక్షురాలు హేమలత అన్నారు. 'మేము నాలుగు లేబర్ కోడ్లకు క్లాజ్‌ల వారీగా అభ్యంతరాలు ఇచ్చాం. కానీ వాటిపై ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమాధానాలు రాలేదు'' అని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి హర్భజన్ సింగ్ సంద్ధూ అన్నారు. 'లేబర్ కోడ్లను రూపొందించే సమయంలో, పార్లమెంటులో ఆమోదించే సమయంలో భాగస్వామ్య పక్షాలతో సంప్రదించలేదు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ లేవనెత్తిన అభ్యంతరాలను కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలాంటి చర్చలు జరపాలన్నా అన్నికేంద్ర కార్మిక సంఘాలతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించాలి' అని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ అన్నారు.