Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమిత్ షా..కమిటీ సిఫారసులు వ్యతిరేకించిన కేరళ, తమిళనాడు
- ఆందోళన వ్యక్తం చేస్తున్న వివిధ పార్టీలు..ప్రధాని మోడీకి లేఖ
- జాతీయ భాష కాదు... అధికార భాష మాత్రమే..
న్యూఢిల్లీ : అధికార భాషపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సిఫారసులు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం, పాలన, విద్య...మొదలైన చోట్ల ఆంగ్ల భాషను కాకుండా హిందీని వినియోగంలోకి తేవాలని కమిటీ సిఫారసు చేసింది. దీనిపై దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రాల సాంస్కృతిక, రాజకీయ మనుగడ..అస్తిత్వం దెబ్బతీసేందుకే మోడీ సర్కార్ ఈ ఎత్తుగడ వేస్తోందని ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాఖ్య వ్యవస్థకు ఇది పెద్ద సవాల్‌గా మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం, పాలనా, విద్యా సంస్థల్లో హిందీని అధికార భాషగా రుద్దడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మోడీ సర్కార్ ఏకపక్ష ధోరణిని రాజకీయ నాయకులు, మేథావులు, నిపుణులు విమర్శిస్తున్నారు.
భాషా యుద్ధం మొదలు పెట్టొద్దు : ఎంకె స్టాలిన్
భాషా యుద్ధం మొదలు పెట్టొద్దనీ, భారత ఐక్యతను కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తిచేశారు. హిందీని రుద్దుతూ పార్లమెంటరీ కమిటీ చేసిన ప్రతిపాదనలు దేశ ఆత్మపై ప్రత్యక్ష దాడి అన్నారు. దేశ వైవిధ్యాన్ని నిరాకరిస్తూ హిందీ అమలు కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం కఠినంగా ఒత్తిడి చేయడం ఆందోళనకరమని పేర్కొన్నారు. కమిటీ సిఫార్సులు అమలు చేస్తే, హిందీయేతరలను తమ మాతృభూమిలో రెండో తరగతి పౌరులుగా చేస్తారని విమర్శించారు. హిందీని రుద్దడం దేశ సమగ్రతకు విరుద్ధమనీ, గతంలో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళనల నుంచి బీజేపీ ప్రభుత్వం పాఠాలు నేర్చుకుంటే మంచిదని హెచ్చరించారు. దేశానికి జాతీయ భాష లేదనీ, అనేక అధికారిక భాషల్లో హిందీ ఒకటని పేర్కొన్నారు. ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ రిక్రూట్మెంట్లలో హిందీని తప్పనిసరి చేయడంతో ఎన్డీయే ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నదని విమర్శించారు.
కమిటీ చేసిన సిఫారసులు
- సెంట్రల్ యూనివర్సిటీలతో సహా అన్ని టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యాసంస్థల్లో బోధనా మాధ్యమం తప్పనిసరిగా హిందీలో ఉండాలి.
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సమర్పించిన నివేదిక 11వ సంపుటిలో కమిటీ 112 సిఫార్సులు చేసింది.
- ఖచ్చితంగా అవసరమైన చోట మాత్రమే ఇంగ్లీష్ బోధనా మాధ్యమంగా ఉండాలి. క్రమంగా ఇంగ్లీషును హిందీతో భర్తీ చేయాలి.
- శిక్షణా సంస్థల్లో హిందీ బోధన, రిక్రూట్మెంట్ పరీక్షల్లో తప్పనిసరి ఆంగ్ల భాషా ప్రశ్నపత్రాన్ని తొలగించడం, హైకోర్టు ప్రొసీడింగ్‌లో ఇచ్చిన ఉత్తర్వులను హిందీలో అనువదించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని కమిటీ చెప్పింది.
- ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లల్లో హిందీలో పనిచేయడం తప్పనిసరి.ఉద్యోగుల ఎంపిక సమయంలో హిందీ పరిజ్ఞానం అవసరం.