Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిందీని బోధనా భాషగా చేయలేమని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోడీకి విజయన్ లేఖ రాశారు. దేశంలో అనేక భాషలు ఉన్నాయనీ, ఒకే భాషను దేశ భాషగా పేర్కొనలేమనీ, ఉన్నత విద్యా సంస్థల్లో హిందీని ప్రధాన బోధనా భాషగా నిర్వహించలేమని పేర్కొన్నారు. యువతకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు పరిమితంగా ఉన్నాయనీ, యువతకు నష్టం చేసే ఏ ప్రయత్నమూ సమాజానికి మేలు చేయదని పేర్కొన్నారు. ఈ విషయంలో దేశంలోని ఉద్యోగార్థులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భాషల్లో ఇవ్వాలని కోరారు. యువతరం వారి మాతృభాష కాకుండా ఇతర భాషలను నేర్చుకునేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందనీ, అలాగని ఒక భాషను రుద్దడం భయాందోళనలకు దారితీస్తుందని పినరయి స్పష్టంచేశారు. భిన్నత్వంలో ఏకత్వం.. మన దేశానికి గర్వకారణమని తెలిపారు. 'ఉన్నత విద్యా సంస్థల్లో హిందీని ప్రధాన బోధనా భాషగా విధించలేం. విద్యా రంగంలో రాష్ట్రాల నిర్దిష్ట అంశాలను గుర్తించాలి. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోరాదు. ఇది మన సహకార సమాఖ్య వ్యవస్థకు మంచిది కాదు' అని విజయన్ లేఖలో పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, దేశ భాషా వైవిధ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసులపై జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీని కేరళ సీఎం కోరారు.