Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష్మణరేఖ ఎక్కడుందో తెలుసు : సుప్రీంకోర్టు
- అఫిడవిట్ దాఖలు చేయాలని ఆర్బీఐ, కేంద్రానికి ఆదేశాలు
న్యూఢిల్లీ : నోట్లరద్దు అంశాన్ని విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేసే అంశంపై 'లక్ష్మణరేఖ' ఎక్కడుందో తమకు అవగాహన ఉందని భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం 2016లో కేంద్రం నోట్లరద్దు చేయటమన్నది పాలనాపరమైన అంశమా? లేదా అనే విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నది. దీనిపై సవివరమైన అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రం, ఆర్బీఐని బుధవారం ఆదేశించింది. 2016లో మోడీ సర్కార్ చేపట్టిన నోట్లరద్దు..దేశ ప్రజల జీవితాల్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. చేతిలో ఉన్న నగదు ఒక్కసారిగా పనికారాదనే భావన..మొత్తం ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ప్రజలందర్నీ కొన్నేండ్లు పాటు అనేక ఇబ్బందులకు గురిచేసింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లమంది నిరుద్యోగులుగా మారారు. అనేక పరిశ్రమలు మూతపడ్డాయి.
దీనికి సంబంధించి సుప్రీంలో ఆనాడే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కేవలం రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మోడీ సర్కార్ నోట్లరద్దు చేపట్టిందని పిటిషన్‌దారులు ఆరోపించారు. వీటిని పరిశీలించిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్..రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. ఆరేండ్ల తర్వాత వీటిపై విచారణ మొదలుకావడంతో ఇరు పక్షాలు బుధవారం వాదనలు వినిపించాయి. నోట్లరద్దు అంశం పాలనా వ్యవహారం కాదని, ఈ విషయాన్ని సుప్రీం తేల్చాల్సిందేనని కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ న్యాయవాది పి.చిదంబరం అన్నారు. ''అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ 86 శాతం నగదును కేంద్రం రద్దు చేసింది. రేపు 100శాతం నగదు రద్దు చేయదని నమ్మలేం. దీనిని అడ్డుకునేందుకు కోర్టులకు అధికారం లేదా?'' అని చిదంబరం అన్నారు.సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరఫున వాదనలు వినిపించారు. పాలనా అంశాలపై కోర్టు సమయం వృథా చేయకూడదన్నారు. దీనిపై పిటిషర్ తరఫు న్యాయవాది శ్యామ్ దివాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులన్నింటినీ రాజ్యాంగ ధర్మాసనం ముందు పెట్టాలని అంతకుముందు బెంచ్ సూచించగా, ధర్మాసనం సమయం వృథా చేయవద్దని పేర్కొన్నడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని వాదించారు.
వాదనలు వినాల్సిందే..
నోట్ల రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ మొదలుపెట్టిన జస్టిస్ ఎస్.ఎ.నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. ఈ సమస్య తమ ముందుకు వచ్చిన నేపథ్యంలో వాటికి సమాధానం ఇవ్వడం తమ బాధ్యతని స్పష్టం చేసింది.
''కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పాలనాపరమైనదా..కాదా? న్యాయ సమీక్ష పరిధికి మించినదా? అనే విషయాలను పరిశీలించి సమాధానం ఇవ్వాల్సి ఉంది. అందుకే వాదనలు వినాల్సిన అవసరముంది. ప్రభుత్వ విధానం, దాని స్వేచ్ఛ అనేది ఇందులో ఒక అంశం మాత్రమే. ప్రభుత్వం తీసుకు వచ్చిన విధానాన్ని మాత్రమే పరిశీలిస్తాం. ఈ క్రమంలో లక్ష్మణరేఖ ఎక్కడివరకు ఉందో మాకు తెలుసు'' అని జస్టిస్ ఎస్.ఎ.నజీర్, జస్టిస్ బి.ఆర్.గవారు, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యమ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పేర్కొన్నది.