Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు విజయవాడలో ప్రదర్శన, బహిరంగసభ
- 16న విదేశీ ప్రతినిధుల సందేశాలు
- 18న నూతన జాతీయ కార్యవర్గం ఎన్నిక
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నేటి నుంచి జరగనున్న సీపీఐ 24వ జాతీయ మహాసభకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి మహాసభ కార్యక్రమాలు ప్రారంభం కానుండగా పలువురు జాతీయ నాయకులు, ప్రతినిధులు గురువారానికే విజయవాడకు చేరుకున్నారు. వీరికి సీపీఐ కార్యకర్తలు, రెడ్‌షర్ట్ వాలంటీర్లు వారికి స్వాగతం పలుకుతున్నారు. కేరళలోని కొల్లాం నుంచి ప్రారంభమైన జాతా కూడా గురువారం సాయంత్రానికే విజయవాడకు చేరుకుంది. 24వ జాతీయ మహాసభకు చిహ్నంగా 24 మంది యువకులు బైక్ ర్యాలీగా ఈ జాతాను నిర్వహించారు. వీరి నుంచి పతాకాన్ని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు స్వీకరించారు. కమ్యూనిస్టు ఉద్యమ నేత చండ్ర రాజేశ్వరరావు స్వగ్రామమైన కృష్ణాజిల్లా మంగళాపురం నుంచి 24 జెండాలతో నిర్వహిస్తున్న పాదయాత్ర శుక్రవారం నాడు బహిరంగ సభాస్థలికి చేరుకుంటుంది. శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు విజయవాడ కేదారేశ్వరిపేట ఫ్రూట్ మార్కెట్ నుంచి ప్రజా ప్రదర్శన ప్రారంభమవుతుంది. సింగ్‌నగర్‌లోని సిఆర్ మైదానం(మాకినేని బసవపున్నయ్య స్టేడియం)లో బహిరంగ సభ జరుగుతుంది. ప్రదర్శన జరిగే మార్గమంతా ఎర్రజెండాలతో అలంకరించారు. 15వ తేది ఉదయం ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో మహాసభ ప్రారంభం కానుంది. ఈ ప్రాంగణానికి ప్రముఖ ప్రముఖ కమ్యూనిస్టు నేత గురుదాస్ దాస్ గుప్తా ప్రాంగణంగా నామకరణం చేశారు. ప్రాంగణంలోని వివిధ విభాగాలకు షమీమ్ ఫైజీ, దాసరి నాగభూషణరావు పేర్లు పెట్టాఉ. బుక్ఎగ్జిబిషన్కు రాఘవాచారి పేర్లు పెట్టారు. ఉదయం 10.30 గంటలకు మహాసభ జరిగే ప్రాంగణంలో జాతీయ పతకాన్ని సిపిఐ సీనియర్ నేత ఏటుకూరి కృష్ణమూర్తి ఆవిష్కరించనున్నారు. అనంతరం సిపిఐ పతాకాన్ని ఆ పార్టీ పూర్వపు ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, అమర వీరుల స్థూపాన్ని సిపిఐ పూర్వపు జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మెన్ ఈడ్పుగంటి నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి.రాజా, ఆహ్వాన సంఘం అధ్యక్షులు నారాయణ మహాసభను లాంఛనంగా ప్రారంభిస్తారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, సీపీఐ (ఎంఎల్) నాయకులు దీపాంకర్ భట్టాచార్య, ఏఐఎఫ్బి నాయకులు జి.దేవరాజన్ సౌహార్ధ్ర సందేశాలు ఇవ్వనున్నారు. భోజన విరామం అనంతరం సంతాపతీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆ తరువాత రాజకీయ తీర్మాన ముసాయిదాను, రాజకీయ సమీక్ష నివేదికను, ఆర్గనైజేషన్ రిపోర్టును ప్రవేశపెడతారు. అనంతరం చర్చలు ప్రారంభమవుతాయి.