Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిశు మరణాల రేటుకు అడ్డుకట్ట
- కేంద్రానికి వైద్య, ఆరోగ్య నిపుణుల సూచన
- కేరళ చక్కటి ప్రదర్శన.. మధ్యప్రదేశ్ ఆందోళనకరం
న్యూఢిల్లీ : భారత్లో అధిక శిశుమరణాల రేటుపై దేశంలోని వైద్య, ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య నుంచి బయట పడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా, దేశంలో శిశు మరణాలకు అడ్డుకట్టవేయాలంటే.. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకు కేటాయింపులు పెంచాలని వారు సూచించారు. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2020 (ఎస్ఆర్ఎస్) ప్రకారం ఐదేండ్ల లోపు చిన్నారుల మరణాల రేటు తగ్గటం కొంత ఊరట కలిగించే విషయమని చెప్పారు. 2015-2020 మధ్య శిశుమరణాల రేటు విషయంలో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ అట్టడుగున ఉన్నది. కేరళ రాష్ట్రం మాత్రం ఈ విషయంలో మంచి ఫలితాలను ప్రదర్శించిందని చెప్పారు. శిశుమరణాల రేటు 2015లో ప్రతి వెయ్యి జననాలకు భారత్లో సగటున 37గా ఉన్నది. అదే సమయంలో మధ్యప్రదేశ్లో ఇది 50 కాగా కేరళలో కేవలం 12గా నమోదైంది. 2020లో ఈ సంఖ్య భారత్లో సగటున 28గా ఉన్నది. మధ్యప్రదేశ్లో 43గా నమోదు కాగా కేరళలో కేవలం ఆరుగానే ఉన్నది.
పొరుగుదేశాలు బెటర్
ఐక్యరాజ్య సమితి గణాంకాలు సైతం శిశుమరణాల విషయంలో భారత వైఫల్యాన్ని ఎత్తి చూపించాయని నిపుణులు వివరించారు. 2015-2020 మధ్య ప్రపంచవ్యాప్తంగా 201 దేశాలకు సంబంధించిన అంచనాల ప్రకారం భారత్ 151వ స్థానంలో ఉన్నదన్నారు. మన పొరుగు దేశాలైతే మనకంటే ముందు స్థానాల్లో ఉన్నాయని గుర్తు చేశారు. శ్రీలంక (67), చైనా (83), భూటాన్ (138), బంగ్లాదేశ్ (141), నేపాల్ (143)లు శిశుమరణాల రేటు విషయంలో భారత్ కంటే చక్కటి ప్రదర్శనను కనబర్చటం గమనార్హమని నిపుణులు చెప్పారు. ఇక ప్రపంచ సగటు కంటే భారత్లో మూడు పాయింట్లు అధికంగా ఉండటం ఆందోళనకరమన్నారు. ''2020లో భారత్లో ప్రతి వెయ్యి జననాలకు శిశుమరణాల రేటు 28గా ఉన్నది. ఇది ఐదేండ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో 32గా నమోదైంది. భారత్తో ఆర్థికంగా సమానంగా ఉన్న దేశాలతోనూ పోలిస్తే ఈ రెండు అంశాల్లో భారత్ చాలా వెనకబడి ఉన్నది. అధిక మధ్య ఆదాయ దేశాలలో సగటు శిశు మరణాల రేటు పదిగా ఉన్నది. అంటే, భారత్తో పోల్చుకుంటే మూడు రెట్లు తక్కువ కావటం గమనార్హం'' అని వైద్య, ఆరోగ్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు చెప్పారు.
ఆరోగ్యంపై తలసరి ఖర్చు రూ.1662..!
భారత్లో ఈ కఠిన పరిస్థితికి కారణం ప్రజారోగ్యంపై చేసే ఖర్చు తక్కువగా ఉండటమేనని ఆరోగ్య, వైద్య నిపుణులు చెప్పారు. 2019లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యంపై చేసిన తలసరి ఖర్చు రూ.1662 మాత్రమే కావటం గమనార్హం. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యంపై ఖర్చు చేసే దేశాల జాబితాలో భారత్ స్థానం అట్టడుగు నుంచి 38వ స్థానంలో ఉన్నది. ఇక ఇదే కాకుండా పోషకాహార లోపం వంటి సమస్యలూ శిశుమరణాలు, ఐదేండ్లలోపు చిన్నారుల మరణాలకు కారణమవుతున్నాయి. ప్రపంచ ఆకలి సూచీ నివేదిక 2020 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 116 దేశాలకు గానూ భారత స్థానం 101గా ఉన్న విషయాన్ని వైద్య, ఆరోగ్య నిపుణులు గుర్తు చేశారు.
ఐసీడీఎస్.. మధ్యాహ్న భోజన పథకాలు విఫలం
ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ (ఐసీడీఎస్), మిడ్ డే మీల్ (మధ్యాహ్న భోజన పథకం) లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద స్కీమ్ ద్వారా చిన్నారుల ఆకలి తీరుస్తున్నామని కేంద్రం చెప్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని సామాజిక కార్యకర్తలు తెలిపారు. ఈ పథకాలు విఫలమయ్యాయన్నారు. బడ్జెట్లో ఈ పథకానికి కేంద్రం కోత విధించటం, క్షేత్రస్థాయిలో పథకం అమలు తీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించటం, చిన్నారులకు అందించే తిండి నాణ్యతలో రాజీపడటం వంటి అంశాలు చిన్నారులకు పోషకాహారం అందపోవటానికి కారణాలుగా నిలుస్తున్నాయని చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2005 (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పథకం పనితీరు క్షేత్రస్థాయిలో ఆశించినంతగా లేకపోవటంతో గ్రామాల్లో ఉండే పలు కుటుంబాలకు పని దొరకక ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నారని వివరించారు. ఈ కారణంతోనూ శిశువులు, చిన్నారులకు సరైన ఆహారాన్ని పలు కుటుంబాలు అందించలేకపోతున్నాయని సామాజిక కార్యకర్తలు, విశ్లేషకులు చెప్పారు.
దేశ ఆర్థిక వ్యవస్థ చక్కగా ఉన్నదనీ, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఐదో స్థానంలో ఉన్నదనీ కేంద్రం చెప్తున్నది. అయితే, ప్రజారోగ్యంపై చేసే అతి తక్కువ ఖర్చు కేంద్రం చెప్పుకుంటున్న గొప్పలకు నిదర్శనంగా ఉన్నదని సామాజిక కార్యకర్తలు చెప్పారు. కేంద్రం ఇకనైనా శిశు, చిన్నారుల మరణాల రేటును తగ్గించటం కోసం కృషి చేయాలన్నారు. ఇందుకు ప్రజారోగ్యం, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకం, ఉపాధి హామీ వంటి పథకాలపై మరింత ఖర్చు చేయాలని సూచించారు.