Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వం ఆమోదం
- రూ.1082.56 కోట్లతో 30 నెలల నిర్మాణ వ్యవధితో నిర్మాణం :వెల్లడించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్-స్టేడ్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. గురువారం ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రూ.1082.56 కోట్లతో 30 నెలల నిర్మాణ వ్యవధితో బ్రిడ్జి నిర్మాణం కానుందని అన్నారు. ఇది ప్రపంచంలో రెండో, దేశంలో మొదటి ఐకానిక్ కేబుల్-స్టేడ్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జి అని తెలిపారు. హైబ్రిడ్ నిర్మాణ అమరిక ద్వారా నిర్మాణాత్మక ప్రయోజనాలను బ్రిడ్జి అందించనున్నట్టు తెలిపారు. నది మీదుగా నిర్మించి బ్రిడ్జిలో పాదచారుల కోసం గాజు మార్గం ఉండనుందని అన్నారు.పైలాన్ గోపురం, లైటింగ్, పెద్ద నావిగేషనల్ స్పాన్ లాంటి అనేక ప్రత్యేకతలు బ్రిడ్జి కలిగి ఉంటుందని అన్నారు.
వంతెన నిర్మాణం పూర్తయితే హైదరాబాద్-తిరుపతి మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గనుందని పేర్కొన్నారు. నల్లమల అడవులు ఎత్తైన కొండలు, శ్రీశైలం రిజర్వాయర్‌తో ఈ వంతెన అందమైన పరిసరాలను కలిగి ఉంటుందని అన్నారు. పర్యటకంగా ఆకర్షణ వంతెనగా బ్రిడ్జి నిలుస్తుందని తెలిపారు. బ్రిడ్జి మీద నుంచి తెలంగాణ వైపు లలిత సోమేశ్వర స్వామి ఆలయం, ఆంధ్ర ప్రదేశ్ వైపున సంగమేశ్వరం ఆలయం ఆకర్షణీయమైన దృశ్యాన్ని చూడొచ్చని అన్నారు.
పుట్టపర్తి-కోడూరు సెక్షన్ నుంచి నాలుగు లైన్ల రోడ్డు
పుట్టపర్తి - కోడూరు సెక్షన్ నుంచి ఇప్పటికే ఉన్న రెండు లైన్ల రోడ్‌ను ఎన్ హెచ్ -342లోని నాలుగు లైన్లగా మార్పుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆమోదం తెలిపింది. రూ.1,318.57 కోట్ల ఖర్చుతో ఈపీసీ పద్దతిలో 47.65 కిలో మీటర్ల మేర నిర్మాణం జరగనుంది. రెండేళ్ళ కాలంలో రోడ్డు ఆధునీకరణ పనులు పూర్తి చేయనుంది. పుట్టపర్తి, బుక్కపట్నంలకు మెరుగైన కనెక్టివిటీని నాలుగు లైన్ల రోడ్డు అందించనుంది. పుట్టపర్తిలోని అంతర్జాతీయ ఖ్యాతి గల సుప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాలను ఈ రోడ్డు కలపనుంది. ఆంధ్రప్రదేశ్, కర్నా టక, వివిధ ఇతర రాష్ట్రాల ప్రజలకు, వివిధ దేశాల రోగులకు సేవలందించే ప్రపంచ స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కనెక్టివిటీని పెంచనున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.