Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు కలవాలి
- సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా పిలుపు
- పార్టీ జాతీయ మహాసభ సందర్భంగా విజయవాడలో భారీ ర్యాలీ, బహిరంగసభ
అమరావతి : వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడిస్తేనే దేశానికి రక్ష అని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాలనను ఎర్ర జెండా ఎంతమాత్రం అంగీకరించదని చెప్పారు. బీజేపీని ఓడించేందుకు ప్రజాస్వామ్య, లౌకిక పార్టీలు, శక్తులు, వాదులను సమీకరించేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఐదు రోజులపాటు విజయవాడలో జరిగే 24వ సీపీిఐ జాతీయ మహాసభను పురస్కరించుకొని తొలి రోజు శుక్రవారం నగరంలో ప్రజా ప్రదర్శన, బహిరంగసభ నిర్వహించారు. అజిత్ సింగ్ నగర్‌లోని చండ్ర రాజేశ్వరరావు మైదానం (ఎంబి స్టేడియం)లో ఏర్పాటుచేసిన సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అధ్యక్షత వహించారు. రాజా మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య, మానవ హక్కుల హననం అప్రతిహతంగా జరిగిపోతోందన్నారు. మావోయిస్టు అనే పేరిట ప్రొఫెసర్ సాయిబాబాను అక్రమంగా నిర్బంధించి బెయిల్ రాకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని, హక్కుల కోసం ఎలుగెత్తిన వారిపై అర్బన్ నక్సలైట్లు, అర్బన్ మావోయిస్టులు, అర్బన్ టెర్రరిస్టులనే ముద్ర వేస్తున్నారని, స్వయంగా ప్రధానే ఆ విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ప్రమాదం వచ్చి పడిందని అన్నారు.
మోడీ పాలన అంతమే సవాల్
బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాలనను అంతం చేయడమే దేశ ప్రజల ముందున్న తక్షణ పెద్ద సవాల్ అని రాజా చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలకు ఏర్పడిందని పేర్కొన్నారు. అందుకే 2024లో జరిగే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీని ఓడించేందుకు దేశంలోని అన్ని ప్రజాస్వామ్య, సెక్యులర్ శక్తులను కూడగట్టేందుకు సీపీఐ కృషి చేస్తుందన్నారు. ఆ దిశగా తమ జాతీయ మహాసభలో చర్చలు జరిపి కార్యాచరణ రూపం ఇస్తామని చెప్పారు. విజయవాడలో జరిగిన ప్రజల కవాతును చూస్తుంటే భవిష్యత్తు మనదే, విజయం మనదేనన్న ఉత్సాహం నింపుతోందన్నారు. తన ప్రసంగానికి ముందు తెలుగులో సభికులనుద్దేశించి 'అందరికీ విప్లవాభినంద నలు' అన్నారు. సీపీఐ నేత చండ్ర రాజేశ్వరరావుకు రెడ్ సెల్యూట్ పలికారు.
ఆర్థిక మాఫియా పాలన
మోడీ హయాంలో దేశంలో అదానీ, అంబానీ వంటి ఆర్థిక మాఫియా కనుసన్నల్లో పాలన సాగుతోందని సభకు అధ్యక్షత వహించిన కె నారాయణ అన్నారు. అదానీ గంజాయి అమ్ముకునే ఇంటర్నేషనల్ స్మగ్లర్ అని, ఇటువంటి 29 మంది మంది గూండాలు, లిక్కర్, గంజాయి, భూ మాఫియాలను మోడీ పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి, మోడీతో కలిసే ఉన్నారని గుర్తుంచుకోవాలని చెప్పారు. రాష్ట్రం విడిపోయినా విజయవాడలో జరుగుతున్న జాతీయ మహాసభను తెలంగాణ పార్టీ తనదిగా భావించి అన్ని విధాలా సహకరించిందన్నారు. సభా వేదికపై సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, పార్టీ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్, తదితరులు పాల్గొన్నారు.