Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది రాజకీయ పార్టీల హక్కుల ఉల్లంఘనే
- ఈసీకి సీతారాం ఏచూరి లేఖ
న్యూఢిల్లీ : ఎన్నికల ప్రవర్తనా నియమావళికి చేయతలపెట్టిన ప్రతిపాదిత సవరణను ఉపసంహరించాలని కోరుతూ సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు లేఖ రాశారు. రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో చేసే వాగ్దానాలకు సంబంధించి ఎన్నికల నిబంధనావళిని సవరించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. అయితే, ప్రతిపాదిత సవరణ అనవసరమని సీపీఐ(ఎం) అభిప్రాయపడుతోందని, ఇందుకు ఈ క్రింది కారణాలు ఉన్నాయని ఏచూరి ఆ లేఖలో పేర్కొన్నారు.
- రాజ్యాంగంలోని 324వ అధికరణ ప్రకారం, ఎన్నికల పర్యవేక్షణ, దిశా నిర్దేశం, నియంత్రణ వంటి కర్తవ్యాలను ఎన్నికల కమిషన్‌కి అప్పగించారు. అంతేకానీ ఎన్నికల సమయంలో ప్రజలకు చేపట్టే సంక్షేమ చర్యల గురించి రాజకీయ పార్టీలు చేసే హామీలు, విధాన ప్రకటనలను నియంత్రించే లేదా అంచనా వేసే అధికారాలను ఎన్నికల కమిషన్‌కు కల్పించలేదు. ఇప్పుడు ఎన్నికల నిబంధనావళికి చేయతలపెట్టిన ప్రతిపాదిత సవరణ, పార్టీలు చేసే ఎన్నికల వాగ్దానాల వివరాలను, వాటి ఆర్థిక పర్యవసానాలను వెల్లడించే ప్రొఫార్మా వల్ల రాజకీయ, విధానపరమైన అంశాల్లో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఇవేవీ కూడా కమిషన్ పరిధిలోకి రావు.
- చేసిన వాగ్దానాలకు సంబంధించి ఏ మేరకు ఆర్థిక పర్యవసానాలు ఎదురవుతాయి, ఇచ్చిన హామీలను అమలు చేసే క్రమంలో అదనపు వనరుల సమీకరణ బాధ్యత వంటి అంశాలను ప్రొఫార్మా ప్రస్తావిస్తోంది. ఇవన్నీ కూడా రాజకీయ, విధానపరమైన అంశాలే, ద్రవ్య సుస్థిరతకు సంబంధించినవే. అసలు ద్రవ్య సుస్థిరత అనే దానిపైనే భిన్నమైన అభిప్రాయాలు వుంటాయి. ఉదాహరణకు, ద్రవ్య బాధ్యతా, బడ్జెట్ నిర్వహణా చట్టంలో ద్రవ్య లోటును జీడీపీలో 3 శాతానికి పరిమితం చేయడాన్ని సిపిఎం తీవ్రంగా విమర్శిస్తోందని ఏచూరి ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతము న్న ఆర్థిక సంప్రదాయవాద ఆలోచనలకు ప్రత్నామ్నాయాలు వున్నాయి.
-సుబ్రమణియం బాలాజీ తీర్పు పున:పరిశీలనకు సంబంధించిన కేసులో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికల కమిషన్ ఒక అఫిడవిట్‌ను సుప్రీం కోర్టుకు సమర్పించింది. ''ఎన్నికల ముందు లేదా ఎన్నికల తర్వాత ప్రకటించే లేదా పంపిణీ చేసే ఏ ఉచితాలైనా అవి ఆయా పార్టీలకు సంబంధించిన విధానపరమైన నిర్ణయమే.'' అని కమిషన్ స్పష్టం చేసింది. అయితే అటువంటి విధానాలు ఆర్థికంగా క్రియాశీలమైనవా కాదా, లేక వాటివల్ల ఆయా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై దుష్ప్రభావాలను చూపిస్తాయా లేదా అనేది ఆయా రాష్ట్ర ఓటర్లు పరిశీలించాల్సిన, నిర్ణయించాల్సిన అంశమని పేర్కొంది. ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలను తాము నియంత్రించలేమని కూడా ఎన్నికల కమిషన్ అంగీకరించింది. చట్టంలో ఆ మేరకు నిబంధనలు లేకుండా ఇటువంటి చర్యలకు పాల్పడితే, అది అధికారాలను అతిక్రమించడమే కాగలదని పేర్కొంది. ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ వైఖరి సరైనది, చెల్లుబాటయ్యేదని ఏచూరి ఆ లేఖలో పేర్కొన్నారు. అందువల్ల, కమిషన్ ఇప్పుడు తన మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోందని, రాజకీయ పార్టీలకు, ప్రజలకు సంబంధించిన రంగంలోకి మరింత చొరబడాలని భావిస్తున్నట్లుగా వుందని అన్నారు.
- సుబ్రమణియం బాలాజీ కేసులో ఇచ్చిన తీర్పును పున: పరిశీ లించాలని కోరుతున్న పిటిషన్‌ను కొత్త ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేసే త్రిసభ్య ధర్మాసనం పరిశీలించాలని అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ ఈ ఏడాది ఆగస్టు 26న నిర్ణయించింది. అందువల్ల ఎన్నికల వాగ్దానా లు, వారిచ్చే ఉచితాల అంశం ఇంకా సుప్రీం కోర్టులో పెండింగ్‌లో వుంది. ఇటువంటి పరిస్థితుల్లో, ప్రజల ఆందోళనలను పరిష్కరిం చేందుకు, వారికి విధానపరమైన, సంక్షేమ చర్యలను ప్రకటించేందుకు రాజకీయ పార్టీలకు గల హక్కులను ఉల్లంఘించే రీతిలో ప్రొఫార్మాను ప్రవేశపెట్టడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సవరించేం దుకు ఎన్నికల కమిషన్ చేపట్టిన చొరవ అవాంఛనీయమైనదని ఏచూరి తన లేఖలో పేర్కొన్నారు. అందువల్ల, తక్షణమే ఈ ప్రతిపాదనను ఎన్నికల కమిషన్ ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోందని ఏచూరి ఆ లేఖలో కోరారు.